తమిళంలో ‘పులి’ రిలీజైనా.. తెలుగులో ఆగిపోయింది..!

తమిళంలో ‘పులి’ రిలీజైనా.. తెలుగులో ఆగిపోయింది..!

Published on Oct 1, 2015 3:54 PM IST

Puli
తమిళ సూపర్ స్టార్ ఇళయదళపతి విజయ్ హీరోగా భారీ బడ్జెట్‌తో రూపొందిన ఫ్యాంటసీ అడ్వెంచర్ సినిమా ‘పులి’. తమిళంలో ఈ ఏడాది అత్యంత ప్రతిష్టాత్మక సినిమాగా ప్రచారం పొందుతూ వచ్చిన ఈ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో భారీ రిలీజ్‌కు సిద్ధమైంది. అయితే చివరినిమిషంలో తలెత్తిన కొన్ని ఆర్థిక ఇబ్బందులతో పులి సినిమా ఈ ఉదయం విడుదలకు నోచుకోకుండా ఆగిపోయింది. తమిళంలో ఉదయం ఏర్పాటు చేసిన ఎర్లీ షోస్ అన్నీ చివరినిమిషంలో క్యాన్సిల్ అయ్యాయి.

ఇక విజయ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న సినిమా ఇలా రిలీజ్ చివరినిమిషంలో ఆగిపోవడంతో అభిమానులంతా ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే హీరో విజయ్, దర్శక నిర్మాతల కృషితో అన్ని ఆర్థిక ఇబ్బందులనూ అధిగమించి ఉదయం 10 గంటల షోతో సినిమా అంతటా ప్రారంభమైంది. కాగా తెలుగు వర్షన్ రిలీజ్ మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆగిపోవడం ఆసక్తికరంగా మారింది. తమిళనాడుతో పాటు ఇతర అన్ని ప్రాంతాల్లో పులి తమిళ వర్షన్ లేట్‌గా అయినా రిలీజ్ కాగా, తెలుగు వర్షన్ విషయంలో సమస్యలన్నీ తీరకపోవడంతో సినిమా రిలీజ్ పూర్తిగా ఆగిపోయింది. మధ్యాహ్నం షోతో సినిమా మొదలవుతుందనే ప్రచారం జరిగినా, నేడు ఈ సినిమా రిలీజ్ దాదాపుగా లేనట్టేనని తెలుస్తోంది.

చింబుదేవన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో శృతి హాసన్, హన్సిక, శ్రీదేవి లాంటి స్టార్స్ నటించడంతో ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఇక చివరి నిమిషంలో సినిమా ఆగిపోవడం, సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయమై సినిమా యూనిట్ నుంచి ఇంకా ఎలాంటి స్పష్టతా రాలేదు. రేపైనా సినిమా రిలీజ్ అవుతుందా? లేదా? అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా కనిపిస్తోన్న ప్రశ్న!

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు