ప్రియుడి కోసం కిరాతకం: గెస్ట్‌ల కోసం ప్రైవేట్ జెట్స్.. పెళ్లికి రూ.17 కోట్ల ప్యాలెస్ బుకింగ్.. అంతలోనే కాబోయే భర్త దారుణహత్య!

ప్రియుడి కోసం కిరాతకం: గెస్ట్‌ల కోసం ప్రైవేట్ జెట్స్.. పెళ్లికి రూ.17 కోట్ల ప్యాలెస్ బుకింగ్.. అంతలోనే కాబోయే భర్త దారుణహత్య!

Published on Jun 23, 2026 5:23 PM IST

ముఖ్య అంశాలు

  • డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం జైపూర్‌లో రూ.17 కోట్లతో లగ్జరీ ప్యాలెస్, గెస్ట్‌ల కోసం రెండు ప్రైవేట్ జెట్స్ ఇరు కుటుంబాలు బుక్ చేశాయి.
  • పెళ్లి పనులు జోరుగా సాగుతున్న సమయంలోనే కేతన్‌ను అతడి కాబోయే భార్య సియా గోయల్ తన ప్రియుడితో కలిసి లోహగడ్ కోటపై నుంచి కిందకు తోసేసింది.
  • ప్రమాదవశాత్తు చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేసినా పోలీసుల విచారణలో హత్య వ్యవహారం బయటపడటంతో రెండు కుటుంబాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి.

డెస్టినేషన్ వెడ్డింగ్ అనగానే ఎంతో గ్రాండ్‌గా ప్లాన్ చేసుకుంటారు. బంధువుల కోసం ఏకంగా రెండు ప్రైవేట్ జెట్స్.. పెళ్లి వేదికగా రూ.17 కోట్లతో జైపూర్‌లో ఓ లగ్జరీ ప్యాలెస్. ఇరు కుటుంబాల్లో ఎంతో సంతోషం. అంతా హ్యాపీగా పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. కానీ, ఊహించని విషాదం వారిని కోలుకోలేని దెబ్బతీసింది. ఫొటోలు తీసుకుందామని తీసుకెళ్లి.. కాబోయే భర్తను అమాంతం 400 అడుగుల లోయలోకి తోసేసిందో యువతి. పుణెలో వెలుగుచూసిన ఈ కిరాతక ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

ప్యాలెస్ బుకింగ్.. ప్రైవేట్ జెట్స్ రెడీ..

పుణెకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కేతన్ అగర్వాల్ (26) కు, సియా గోయల్ (20) అనే యువతితో పెద్దలు వివాహం నిశ్చయించారు. నవంబర్‌లో రాజస్థాన్‌లోని జైపూర్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశారు. ఇందుకోసం సుమారు రూ. 17 కోట్లు వెచ్చించి ఒక విలాసవంతమైన ప్యాలెస్‌ను కూడా రిజర్వ్ చేశారు. పెళ్లికి వచ్చే అతిథుల కోసం ప్రత్యేకంగా రెండు ప్రైవేట్ విమానాలను సైతం ఏర్పాటు చేశారు. రెండు కుటుంబాలు ఎంతో సంతోషంగా పెళ్లి పనులు చూసుకుంటున్నాయి. అయితే, సియా అప్పటికే చేతన్ చౌదరి అనే యువకుడిని ప్రేమిస్తోంది. పెద్దలు కుదిర్చిన పెళ్లి ఇష్టంలేక, నేరుగా కాబోయే భర్తనే కడతేర్చాలని ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది.

నమ్మించి.. లోయలోకి తోసేసి..

బర్త్‌డే సెలబ్రేషన్స్, ప్రీ-వెడ్డింగ్ షూట్ పేరుతో జూన్ 18న కేతన్‌ను పుణె సమీపంలోని చారిత్రక లోహగడ్ కోటకు తీసుకెళ్లింది సియా. అప్పటికే ఆ కోటపై ఆమె ప్రియుడు చేతన్ మాటువేసి ఉన్నాడు. కోట అంచున ఫొటోలు దిగుతున్న సమయంలో ఇద్దరూ కలిసి కేతన్‌ను ఒక్కసారిగా లోయలోకి తోసేశారు. ఆ తర్వాత ఏమీ ఎరుగనట్లు.. ఈదురు గాలుల వల్ల కాలుజారి లోయలో పడిపోయాడని పోలీసులకు ఫోన్ చేసి నాటకమాడారు.

దీన్ని మొదట సాధారణ ప్రమాదంగానే భావించిన పోలీసులు.. సియా కాల్ డేటా, వాట్సాప్ చాట్స్ పరిశీలించగా అసలు నిజాలు బయటపడ్డాయి. ప్రియుడితో కలిసి ఆమె హత్య చేసినట్లు నిర్ధారణ కావడంతో ఇద్దరినీ అరెస్ట్ చేశారు. ఎంతో సంతోషంగా పెళ్లి పనులు చేసుకుంటున్న సమయంలో ఈ దారుణం వెలుగుచూడటంతో రెండు కుటుంబాలు తీవ్ర షాక్‌లో ఉన్నాయని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు