మహేష్, తారక్‌లతో పూరీ తదుపరి సినిమాలు..!!

2nd, October 2016 - 10:32:43 AM

puri-jaganadh
తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడు పూరీ జగన్నాథ్ స్థాయేంటో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తన మాస్ పంచ్‌తో స్టార్ హీరోలందరికీ తిరుగులేని విజయాలను అందించిన ఆయన ప్రస్తుతం కళ్యాణ్ రామ్‌తో చేసిన ఇజం అనే సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఇక ఈ సినిమా ఇలా ఉండగానే అప్పుడే పూరీ దర్శకత్వంలో తెరకెక్కే తదుపరి సినిమా ఏమై ఉంటుందన్నది ఇప్పట్నుంచే చర్చ మొదలైంది. కొద్దినెలల క్రితం సూపర్ స్టార్‌ మహేష్‌తో పూరీ ‘జన గణ మన’ అనే సినిమా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈమధ్యే ఎన్టీఆర్‌తో కూడా ఓ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ చర్చలు మొదలుపెట్టారు.

తాజాగా ఈ రెండు సినిమాలనే ప్రస్తావిస్తూ తన తదుపరి సినిమాలు మహేష్, ఎన్టీఆర్‌లతోనే ఉంటాయని పూరీ స్పష్టం చేశారు. అయితే ఈ రెండిట్లో ఏది ముందు సెట్స్‌పైకి వెళుతుందనేది మాత్రం చెప్పలేదు. కుటుంబ సభ్యులతో సరదాగా కొన్ని రోజులు గడిపేందుకు సొంత ఊరెళ్ళిన పూరీ, అక్కడి మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా పై విషయం చెప్పారు. మరి పూరీ-మహేష్, పూరీ-ఎన్టీఆర్ ఈ రెండు కాంబినేషన్స్‌లో ఏది మొదట సెట్స్‌పైకి వెళుతుందన్నది వేచిచూడాల్సిందే!