బత్తుల కోటేశ్వరరావు నిర్మాణంలో వీరు వులవల దర్శకత్వం వహించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘పురుష:’ సినిమా మే 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా పరిచయమవుతున్నారు. బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమా విడుదల తేదీని తాజాగా చిత్ర బృందం ప్రెస్ మీట్ ద్వారా అధికారికంగా ప్రకటించింది.
హీరో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తనను నమ్మి అవకాశమిచ్చిన తండ్రి, నిర్మాత కోటేశ్వరరావు గారికి, దర్శకుడికి కృతజ్ఞతలు తెలిపారు. ఇదొక చక్కటి కుటుంబ కథా చిత్రమని, అందరికీ నచ్చుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ‘మళ్లీరావా’, ‘జెర్సీ’, ‘మసూద’ వంటి విజయవంతమైన చిత్రాలకు పనిచేసిన దర్శకుడు వీరు వులవల మాట్లాడుతూ.. ఈ కథను తాను అనుకున్నట్లుగానే తెరకెక్కించానని, పవన్ కళ్యాణ్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నమ్మకం వ్యక్తం చేశారు.
ఈ చిత్రంలో సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్, హాసిని సుధీర్, రాయంచ, విషిక తదితరులు కీలక పాత్రలు పోషించారు. దర్శకుడి ప్రతిభపై సప్తగిరి ప్రశంసలు కురిపించగా, పురుషులంతా గర్వపడేలా ఈ సినిమా ఉంటుందని కసిరెడ్డి అన్నారు. వేసవి కానుకగా మే 22న థియేటర్లలోకి వస్తున్న ఈ చిత్రాన్ని కుటుంబ సమేతంగా చూసి ఆదరించాలని చిత్ర బృందం కోరింది.


