ఫోటో మూమెంట్ : ఆడియో రిలీజ్ కోసం రాజమౌళి ప్లాన్స్..!

ఫోటో మూమెంట్ : ఆడియో రిలీజ్ కోసం రాజమౌళి ప్లాన్స్..!

Published on May 25, 2015 10:29 PM IST

baahubali
దర్శకుడు రాజమౌళికి ప్రమోషనల్ కార్యక్రమాల్లో కొత్త పంథాను సృష్టించడం వెన్నతో పెట్టిన విద్య. ‘మగధీర’ సినిమా నుంచి ఈ తరహా ప్రమోషన్లతో సినిమాపై క్రేజ్‌ను అమాంతం పెంచేసే టెక్నిక్‌ను వాడుకుంటూ వస్తున్నారు రాజమౌళి. తాజాగా ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘బాహుబలి’ సినిమాకు కూడా ఇప్పట్నుంచే సరికొత్త ప్రమోషన్‌కు శ్రీకారం చుట్టగా, ఇక ఆడియో వేడుక నిర్వహణలో తానేంటో నిరూపించుకునేందుకు మరోసారి సిద్ధమైపోయారు రాజమౌళి.

‘బాహుబలి ది బిగినింగ్‌’గా పిలవబడుతున్న మొదటి భాగానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌, ఆడియోలను మే 31న విడుదల చేయనున్న విషయం తెలిసిందే. దీనికి నెలరోజుల ముందునుంచే మొదలుపెట్టిన పోస్టర్స్ రిలీజ్ ప్లాన్ సూపర్ సక్సెస్ అయింది. అదేవిధంగా ఆడియో రిలీజ్ వేడుకను కూడా సూపర్ హిట్ చేసేందుకు సినిమా యూనిట్ సర్వశక్తులూ ఒడ్డుతోంది. హైటెక్స్‌ ఓపెన్ గ్రౌండ్స్‌లో భారీ ఎత్తున జరగనున్న ఈ వేడుకకు కోటికి పైనే ఖర్చు పెడుతున్నారు.

ఇక హీరో నాని యాంకర్‌గా చేయనుండడం విశేషంగా కనిపిస్తోంది. ఇంకా మరిన్ని ఆసక్తికర అంశాలతో ఆడియో రిలీజ్ ఆసాంతం అలరించేందుకు యూనిట్ సిద్ధమైంది. ఆడియో రిలీజ్‌ కోసం రకరకాల ప్లాన్స్ గీసుకుంటున్న రాజమౌళిని ఈ ఫోటోలో చూడవచ్చు. ఇదే ఫోటోలో రాజమౌళి భార్య రమా, సంగీత దర్శకుడు కీరవాణి, ప్రొడక్షన్ మేనేజర్ వల్లి తదితరులు రాజమౌళి చెప్పే విషయాలను ఆసక్తిగా నోట్ చేసుకోవడం చూడొచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు