అమితాబ్‌కు రాజమౌళి కృతజ్ఞత..!

అమితాబ్‌కు రాజమౌళి కృతజ్ఞత..!

Published on Jun 22, 2015 4:48 PM IST

rajamouli

ప్రస్తుతం దేశమంతా ‘బాహుబలి’ ఫీవర్ పట్టుకున్న విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న బాహుబలి ది బిగినింగ్ విడుదలకు దగ్గరవడంతో ప్రభాస్, రానా, తమన్నా ఇలా భారీ తారాగణమంతా ప్రమోషన్ కార్యక్రమాలతో ముంబైలో హల్‌చల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రానా బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌కు బాహుబలి ట్రైలర్‌ను చూపించారు.

బాహుబలి ట్రైలర్‌తో ఎంతో ఇంప్రెస్ అయిన అమితాబ్ “ఇలాంటి విజువల్ వండర్‌ను ఇండియన్ సినిమాపై ఆవిష్కరించడానికి గట్స్ ఉండాలి. కేవలం హాలీవుడ్‌లో మాత్రమే చూడగల విజువల్ ఎఫెక్ట్స్‌ను ఒక ఇండియన్ సినిమాలో చూడడం అద్భుతంగా ఉంది. ఈ సినిమాలో నేనూ నటించి ఉంటే బాగుండేది అనిపిస్తుంది” అన్నారు. అమితాబ్ లాంటి సూపర్ స్టార్ బాహుబలిపై ఈ స్థాయిలో ప్రశంసలు కురిపించడంతో బాహుబలి టీమ్ సంబరాల్లో మునిగిపోయింది.

అమితాబ్ ప్రశంసలపై స్పందిస్తూ రాజమౌళి ఆయనకు థ్యాంక్స్ తెలిపారు. “మేమింకా ఆ మూడ్‌లోనే ఉన్నాం. మేమెంతో కష్టపడి తెరకెక్కించిన సినిమా గురించి ఇండియన్ సినిమాలోని ఓ లెజెండ్ ఇలా ప్రశంసించడం గర్వంగా ఉంది” అంటూ తన ఆనందాన్ని వెలిబుచ్చారు. ఇక తెలుగు, తమిళ, మళయాల, హిందీ భాషల్లో జూలై 10న భారీ ఎత్తున బాహుబలి విడుదల కానున్న విషయం తెలిసిందే!

తాజా వార్తలు