రజనీ ‘కబాలి’ స్టోరీలైన్ ఇదేనా..?

రజనీ ‘కబాలి’ స్టోరీలైన్ ఇదేనా..?

Published on Nov 5, 2015 11:32 AM IST

kabali
‘కబాలి’.. రజనీ కాంత్ హీరోగా, తమిళంలో రియలిస్టిక్ సినిమాలతో సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న పా రంజిత్ తెరకెక్కిస్తోన్న గ్యాంగ్‌స్టర్ సినిమా. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోన్న ఈ సినిమాపై అనౌన్స్ అయిన రోజునుంచే విపరీతమైన అంచనాలు బయలుదేరాయి. ‘విక్రమ సింహ’, ‘లింగా’ లాంటి వరుస పరాజయాల తర్వాత రజనీ ఓ యువ దర్శకుడితో సినిమా ఒప్పుకోవడం దగ్గర్నుంచీ, భాషా సినిమాతో రజనీకి ఒక స్టైల్‌ను తెచ్చిపెట్టిన గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో రూపొందే సినిమా అవ్వడం వరకూ ‘కబాలికి’ అన్నీ ప్రత్యేకంగా కనిపిస్తూ వచ్చాయి.

ఇక ఈ సినిమా కథ గురించి ఓ ఆసక్తికర కథనం ప్రస్తుతం సినిమాపై మరింత అంచనాలను పెంచేస్తోంది. కిడ్నాప్‌కు గురైన తన కూతుర్ని కాపాడుకునే క్రమంలో గ్యాంగ్‌స్టర్‌ కార్యక్రమాలకు ఇచ్చిన రిటైర్‌మెంట్‌ను వెనక్కి తీసుకొని మలేషియాలో మళ్ళీ చెలరేగే హీరో పాత్ర చుట్టూ సినిమా తిరుగుతుందని తెలుస్తోంది. తన వయసుకు తగ్గ పాత్రలో అద్భుతమైన ఎమోషన్ ఉన్న కథలో నటించడం విశేషంగానే చెప్పుకోవచ్చు. రజనీ స్టైల్‌ను అందిపుచ్చుకుంటూనే అనవసరమైన కమర్షియల్ ఎలిమెంట్స్‌కు తావివ్వకుండా కథకే ప్రాధాన్యం ఇస్తూ పా రంజిత్ ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మలేషియాలో ఈ సినిమాకు సంబంధించిన ఓ భారీ షెడ్యూల్ జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన స్టిల్స్, పోస్టర్‌లో రజనీని చూసిన వారంతా ఫిదా అయిపోయిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో రజనీ సరసన రాధికా ఆప్టే హీరోయిన్‌గా నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు