
మణిరత్నం తెరకెక్కించిన మరో అందమైన ప్రేమకథ ‘ఓకే కన్మణి’ (ఓకే బంగారం). ఈ సినిమా విడుదలైన దగ్గర్నుంచీ ఇటు సాధారణ ప్రేక్షకుల నుంచే కాకుండా సినీ పరిశ్రమ నుంచి కూడా మంచి రెస్పాన్స్ రాబట్టుకుంటూ బాక్సాఫీస్ వద్ద దూసుకెళుతోంది. చాన్నాళ్ళకు వెండితెరపై మణిరత్నం మ్యాజిక్ మళ్ళీ పనిచేసిందని సినీ పరిశ్రమ ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే అమితాబ్ బచ్చన్, సూర్య, గౌతమ్ మీనన్ లాంటి ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసలు కురిపించగా తాజాగా ఆ జాబితాలో సూపర్ స్టార్ రజనీకాంత్ చేరిపోయారు.
ఈ మధ్యే రజనీ కోసం ‘ఓకే కన్మణి’ యూనిట్ ఓ ప్రత్యేక షోను ఏర్పాటు చేసింది. ఈ సినిమా చూసిన తర్వాత రజనీ మణిరత్నంను పొగడ్తలతో ముంచెత్తారు. ఒక అందమైన ప్రేమకథను ఇంత యూత్‌ఫుల్‌గా, అద్భుతంగా తీసినందుకు ఆయన సినిమా యూనిట్‌ను అభినందించారు. చివరగా రజనీ తన స్టైల్లో “వాట్ ఏ ఫిల్మ్ మణీ” అని తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. గతంలో రజనీకాంత్, మణిరత్నంల కాంబినేషన్‌లో ‘దళపతి’ అనే సినిమా రూపొంది ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే!
‘ఓకే కన్మణి’ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించిన దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్‌ల జంట ఆద్యాంతం ప్రేక్షకుడిని కట్టిపడేసింది. తారగా నటించిన నిత్యామీనన్ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతుంది. ఇక ఏ.ఆర్.రెహమాన్ సంగీతం, పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్.

