కోలీవుడ్ లో ఈ ఏడాది దీపావళి పండుగకు ఒక భారీ బాక్సాఫీస్ క్లాష్ జరగబోతున్నట్లు తెలుస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’ షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. నెల్సన్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ డిజిటల్ రైట్స్ డీల్ ప్రస్తుతం చర్చల దశలో ఉంది. ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ ఒక పవర్‌ఫుల్ క్యామియో రోల్ పోషిస్తుండగా, ఆయనకు సంబంధించిన షూటింగ్ వచ్చే వారం జరగనుంది. మేకర్స్ ఈ సినిమాను దీపావళి కానుకగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
మరోవైపు, వర్సటైల్ యాక్టర్ ధనుష్ కూడా తన 55వ సినిమాను అదే దీపావళి రేసులో నిలపాలని భావిస్తున్నట్లు కోలీవుడ్ మీడియా సమాచారం. ‘అమరన్’ ఫేమ్ రాజ్‌కుమార్ పెరియాసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. సాయి పల్లవి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
ప్రస్తుతం ఈ రెండు సినిమాల టీమ్స్ షూటింగ్స్ పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాయి. రజనీకాంత్ ‘జైలర్ 2’ అధికారిక ప్రకటన త్వరలోనే రానుండగా, ధనుష్ 55వ చిత్ర బృందం కూడా తమ దీపావళి రిలీజ్ ప్లాన్‌ను త్వరలోనే ప్రకటించనుంది. ఒకవేళ ఇదే నిజమైతే, ఈ దీపావళికి బాక్సాఫీస్ వద్ద ఇద్దరు స్టార్ హీరోల మధ్య గట్టి పోటీ తప్పేలా లేదు.


