బుల్లితెరపై సూపర్ హిట్ రియాలిటీ షోస్ కి హోస్ట్‌గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఓంకార్, ఆ తర్వాత ‘జీనియస్’ సినిమాతో వెండితెరకు దర్శకుడిగా పరిచయం అయ్యాడు. జీనియస్ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా, ఓంకార్‌కి దర్శకుడిగా మాత్రం మంచి పేరు తెచ్చి పెట్టింది. ‘జీనియస్’ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న ఓంకార్, ఈ సారి కమర్షియల్ హిట్ కొట్టాలని ప్రయత్నించిన రెండవ సినిమా ‘రాజుగారి గది’. హర్రర్ కామెడీ నేపధ్యంలో వచ్చిన ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అక్టోబర్ 22వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి స్క్రీన్ కౌంట్‌తో విడుదలైన ఈ సినిమా, పేరుకు తగ్గట్టే మంచి హర్రర్ కామెడీగా గుర్తింపు తెచ్చుకుంది. కామెడీకి తెలుగులో మంచి ఆదరణ కనిపిస్తోన్న పరిస్థితుల్లో విడుదలైన ఈ హర్రర్ కామెడీకి అన్నిచోట్లా మంచి రెస్పాన్స్ వస్తోంది. దాంతో మూడవ రోజుకి ఈ సినిమా థియేటర్స్ కూడా పెరిగాయి. మరోవైపు ఈ చిత్ర టీం చేస్తున్న ప్రమోషన్స్ కూడా ఈ సినిమాకి బాక్స్ ఆఫీసు వద్ద హెల్ప్ అవుతున్నాయి. మొదటి మూడు రోజులు ఈ సినిమాకి సూపర్ బిజినెస్ అవ్వడంతో డిస్ట్రిబ్యూటర్స్ చాలా హ్యాపీ గా ఉన్నారు. వీకెండ్ లోపే అన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవన్ అయిపోవడమే కాకుండా మొదటి వారంలోనే లాభాలను కూడా సాధిస్తాం అని అంటున్నారు. తెలుగులో మంచి పేరున్న వారాహి చలనచిత్రం, ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు ఈ సినిమాను విడుదల చేయడంతో ఈ సినిమాకి మరింత మంచి కలెక్షన్స్ వస్తున్నాయి.


