రాకేష్ వర్రే ‘మాయలేడి’ గ్లింప్స్ విడుదల.. ఆకట్టుకుంటున్న లవ్ అండ్ యాక్షన్ డ్రామా!


‘ఎవరికీ చెప్పొద్దు’, ‘పేకమేడలు’ వంటి కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన నటుడు, నిర్మాత రాకేష్ వర్రే మరో ఆసక్తికర కథతో రాబోతున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తూ, స్వయంగా క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న తాజా చిత్రం ‘మాయలేడి’. ప్రశంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో మధుమిత సర్కార్ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

ఈ గ్లింప్స్ పరిశీలిస్తే.. కథానాయిక గురించి తెలుసుకుంటున్న కొద్దీ ఆమెపై హీరోకు ఆసక్తి, ఇష్టం పెరుగుతూ ఉంటాయి. ఈ జంట తమ ప్రేమను వ్యక్తపరుచుకుని సంతోషంగా సాగుతున్న సమయంలో, హీరోయిన్ గురించి కొన్ని ఊహించని విషయాలు వెలుగులోకి వస్తాయి. ‘తమ మధ్యకు ఎవరైనా వస్తే ఊరుకోనంటూ’ కథానాయిక యాక్షన్ సీన్లలో కనిపించడం, శత్రువులతో ఇద్దరూ కలిసి పోరాడటం గ్లింప్స్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. చివర్లో “ఇప్పుడు నా లవ్ స్టోరీలో విలన్ ఎవరో తెలుస్తోంది..” అంటూ రాకేష్ వర్రే చెప్పే సంభాషణ కథపై ఆసక్తిని పెంచుతోంది.

ఈ గ్లింప్స్‌లో రాకేష్ వర్రే నూతన శైలిలో కనిపించారు. లవ్ సీన్స్, యాక్షన్ సీక్వెన్సుల్లో ఆయన నటన ఆకట్టుకునేలా ఉంది. విశాల్ చంద్రశేఖర్ స్వరపరిచిన “నిన్ను చూసినాక ఈ క్షణం..” అనే నేపథ్య గీతం గ్లింప్స్‌కు మంచి ఫీల్‌ను అందించింది. లవ్ అండ్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ చిత్రాన్ని త్వరలోనే థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Exit mobile version