
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు శ్రీనువైట్లల క్రేజీ కాంబినేషన్‌లో భారీ ఎత్తున ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. తండ్రి మెగా స్టార్ చిరంజీవి వారసత్వాన్ని అందిపుచ్చుకొని వరుస సినిమాలతో టాప్ లీగ్‌లో చెర్రీ చేస్తోన్న ఈ తొమ్మిదవ సినిమాపై అనౌన్స్ అయిన రోజునుంచే విపరీతమైన అంచనాలున్నాయి. ఇక ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉండనుందనే విషయాన్ని చిరు బర్త్‌డే కానుకగా విడుదలైన ఫస్ట్‌లుక్ టీజర్ ఋజువు చేసింది. విడుదలైన నాటినుంచే టీజర్ యూట్యూబ్‌లో దూసుకుపోతోంది.
హై వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ సినిమాకు సంబంధించి ఈ మధ్యే విడుదల చేసిన ఈ టీజర్‌లో చరణ్ అల్ట్రా స్టైలిష్ లుక్, రిచ్‌క్లాస్ సినిమాటోగ్రఫీ, థమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్‌గా నిలిచాయి. ఇక యాక్షన్ ఎపిసోడ్స్‌లో రామ్ చరణ్ ఈజ్ యాక్టింగ్ గురించి చెప్పుకోవాలి. ముఖ్యంగా “వేట ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. మొదలుపెట్టాక, పూర్తయ్యేవరకూ రిక్వెస్ట్‌లు వినపడవ్! రియాక్షన్‌లు కనపడవ్! ఓన్లీ రీసౌండ్!” అంటూ చరణ్ చెప్పే డైలాగ్ అభిమానులకు పండగే అనడంలో అతిశయోక్తి లేదు.
తాము అనుకున్నట్లుగానే టీజర్ అద్భుతంగా ఉండడంతో అభిమానులంతా సంబరాల్లో మునిగిపోయారు. అందుకు తగ్గట్టుగానే విడుదలైన మూడు రోజుల్లోనే 1 మిలియన్ (10 లక్షల) వ్యూస్ సాధించి చెర్రీ సినిమా టీజర్ యూట్యూబ్‌లో అదరగొడుతోంది. ఇక టీజరే ఈ రేంజ్‌లో ఉంటే ఇక సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందని అభిమానులు ఇప్పట్నుంచే సినిమాపై అంచనాలు పెంచేసుకుంటున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్ నటించారు. అక్టోబర్ 15న సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు నిర్మాత డీవీవీ దానయ్య ప్లాన్ చేస్తున్నారు.