​రానా ‘స్పిరిట్ మీడియా’ చేతుల్లోకి ‘అమీర్ లోగ్’ సినిమా హక్కులు

​రానా ‘స్పిరిట్ మీడియా’ చేతుల్లోకి ‘అమీర్ లోగ్’ సినిమా హక్కులు

Published on Jul 2, 2026 8:00 AM IST

నటుడు రానా దగ్గుబాటికి చెందిన ‘స్పిరిట్ మీడియా’ సంస్థ ‘అమీర్ లోగ్’ చిత్ర పంపిణీ హక్కులను సొంతం చేసుకుంది. అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ ఎల్ఎల్‌పి బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో స్పిరిట్ మీడియా విడుదల చేయనుంది. హైదరాబాద్ గల్లీల్లోని ముగ్గురు స్నేహితుల కథ, వారి ప్రయాణం, యువతకు ఇచ్చే సందేశం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

​రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎంసీ హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రలు పోషించారు. వేదశ్రీ, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయియోగి కీలక పాత్రల్లో నటించారు. ఇదొక యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిందని, కథలోని కంటెంట్ నచ్చడంతో ఈ చిత్రాన్ని పంపిణీ చేసేందుకు ముందుకు వచ్చినట్లు స్పిరిట్ మీడియా ప్రతినిధులు తెలిపారు.

​ఈ చిత్రానికి స్మరణ్ సాయి సంగీతం అందించగా, రోహిత్ పెనుమత్స ఎడిటర్‌గా, ఎస్‌వీకే ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, రాహుల్ సిప్లిగంజ్ పాడిన పాటలకు శ్రోతల నుంచి మంచి స్పందన లభించిందని చిత్రబృందం పేర్కొంది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.

తాజా వార్తలు