ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘AA22’ ప్రస్తుతం ముంబైలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో తాజాగా ‘నేషనల్ క్రష్’ రష్మిక మందన్న అడుగుపెట్టింది. అయితే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ, ఈ చిత్రంలో రష్మిక నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. ఇప్పటివరకు తన కెరీర్‌లో ఎక్కువగా సాఫ్ట్ రోల్స్ చేసిన రష్మిక, తొలిసారిగా అల్లు అర్జున్‌ను ఢీకొట్టే పవర్‌ఫుల్ విలన్‌గా నటించడం విశేషం.
ముంబై షెడ్యూల్‌లో భాగంగా రష్మిక ప్రస్తుతం తన సోలో సీన్ల షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ పూర్తయిన వెంటనే అల్లు అర్జున్, జాన్వీ కపూర్ మరియు ‘కుబేర’ ఫేమ్ జిమ్ సర్భ్‌లతో కలిసి కీలక సన్నివేశాల్లో ఆమె నటించనుంది. ‘పుష్ప’ సిరీస్‌లో బన్నీకి జోడీగా అలరించిన ఈ జంట, ఇప్పుడు ఒకరికొకరు ప్రత్యర్థులుగా ఎలా తలపడతారనేది అభిమానుల్లో విపరీతమైన ఆసక్తిని కలిగిస్తోంది. ఈ చిత్రంలో దీపికా పదుకొణె మెయిన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు.
సన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాను రెండు భాగాలుగా విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ ఇందులో మల్టిపుల్ రోల్స్‌లో కనిపిస్తారనే వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


