
ట్విట్టర్లో తన వ్యాఖ్యలతో, సినిమాల్లో తాను ఎంచుకునే నేపథ్యాలతో ఎప్పుడూ ఏదో ఒక వివాదం సృష్టిస్తూ ఉండే రామ్ గోపాల్ వర్మ, ప్రస్తుతం డేంజరస్ క్రిమినల్ వీరప్పన్ జీవితంలోని కొన్ని సంఘటనల నేపథ్యంలో ‘కిల్లింగ్ వీరప్పన్’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ‘వర్మ ఈజ్ బ్యాక్’ అన్న నినాదాన్ని మోసుకొస్తోంది. ఇదిలా ఉంటే.. గత కొంతకాలంగా కేవలం హర్రర్, యాక్షన్ అంశాల చుట్టూ తిరిగే సినిమాలనే తీసుకుంటూ వెళుతోన్న వర్మ, తనదైన అండర్ వరల్డ్ సినిమాలను తగ్గించారు.
కాగా తాజాగా మళ్ళీ అండర్ వరల్డ్ అంశాలను పట్టుకొని ఆయన మరో సినిమాకు సిద్ధమవుతున్నట్లు ఆయన తాజా వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. బెంగళూరు నేపథ్యంలో అండర్ వరల్డ్‌కు సంబంధించిన వారి గురించి తెలుసుకోవడం జరిగిందని, ముంబై అండర్ వరల్డ్ కంటే ఈ బెంగళూర్ అండర్ వరల్డ్ ఇంకా ఎక్కువ బలమైనదని వర్మ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ముత్తప్పా రాయ్ అనే బెంగళూరుకు చెందిన, గతంలో అండర్ వరల్డ్ డాన్‌గా పేరుమోసిన వ్యక్తిని కలిసిన వర్మ, త్వరలోనే బెంగళూరు అండర్ వరల్డ్ నేపథ్యంలో ఓ సినిమా తీయనున్నారట. దావూద్ కంపనీ కన్నా పెద్దదైన బీ-కంపనీ నేపథ్యంలో ఆయన తీయబోయే సినిమాకు ‘అప్పా’ అనే పేరు పెడతారట. ఫాదర్ ఆఫ్ ఆల్ ది గాడ్‌ఫాదర్స్ అనేది ట్యాగ్‌లైన్. ఇప్పటికే వరుస సినిమాలను చేస్తూ బిజీగా గడిపేస్తున్న ఆయన మరి ఈ సినిమాను ఎప్పుడు మొదలుపెడతాడో చూడాలి. ఏది ఏమైనా వర్మ మళ్ళీ అండర్ వరల్డ్ బాట పట్టినా కంపనీ, సర్కార్ లాంటి సినిమా చేస్తే చూడాలన్నది అభిమానుల అభిప్రాయం!

