తెలుగు చలన పరిశ్రమలో ఒకే టైములో తెరకెక్కిన రెండు పీరియాడికల్ ఫిల్మ్స్ బాహుబలి మరియు రుద్రమదేవి. బాహుబలి సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యి సరికొత్త రికార్డ్స్ ని సృష్టిస్తోంది. అది పక్కన పెడితే కాకతీయ వీరనారి రుద్రమదేవి జీవితకథ ఆధారంగా చేసిన సినిమా ‘రుద్రమదేవి’. ఓరుగల్లు ఘనతను భారతదేశ దశదిశలా చాటి చెప్పిన రుద్రమదేవి ఘనతని ప్రపంచానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో భారీ చిత్రాల దర్శకుడు గుణశేఖర్ తీసిన ఈ చారిత్రాత్మక సినిమాలో అనుష్క టైటిల్ రోల్ లో కనిపించనుంది. ముందుగా ఈ సినిమాని జూన్ చివర్లో రిలీజ్ చెయ్యాలి అనుకున్నారు కానీ టెక్నికల్ గా వర్క్ అనుకున్న టైం కి పూర్తి కాకపోవడంతో వెనక్కి వెళ్ళారు.
తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర టీం రుద్రమదేవి సినిమాని జూలై చివర్లో లేదా ఆగష్టులో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. దాంతో ఈ చిత్ర టీం ప్రమోషనల్ యాక్టివిటీస్ ని మొదలు పెట్టడానికి కూడా సిద్దమైంది. అందులో భాగంగా రీసెంట్ గా బాహుబలి టీం ఫాలో అయిన ప్రమోషనల్ స్ట్రేటజీని రుద్రమదేవి టీం ఫాలో అవ్వనుంది. బాహుబలి టీం ముందుగా ఒక్కో పాత్రని పరిచయం చేస్తూ ఒక్కో పోస్టర్ ని రిలీజ్ చేసారు. ఇప్పుడు ఇదే విధంగా రుద్రమదేవి టీం ఒక్కో పాత్రని పరిచయం చేస్తూ ఒక్కో పోస్టర్ ని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో మొదటి క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఫస్ట్ ప్రమోషనల్ పోస్టర్ ని రిలీజ్ చేయనున్నారు. ఈ ఫార్మాట్ లో చేసిన బాహుబలి ప్రమోషన్స్ ని సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది, అదే రేంజ్ రెస్పాన్స్ రుద్రమదేవి పోస్టర్స్ కి కూడా వస్తుందని ఈ చిత్ర టీం భావిస్తోంది.
అనుష్క రుద్రమదేవిగా, రానా చాళుక్య వీరభద్రుడిగా, అల్లు అర్జున్ గోనగన్నా రెడ్డిగా కనిపించనున్న ఈ మూవీలో కృష్ణం రాజు, నిత్య మీనన్, కేథరిన్, హంసా నందిని, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి తోట తరణి ఆర్ట్ డైరెక్టర్.


