
తెలుగులో ఈమధ్య కాలంలో ప్రేక్షకులను ఎంతగానో ఎదురుచూయించిన సినిమాల్లో ‘రుద్రమదేవి’ మొదటి స్థానంలో ఉంటుంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడినా కూడా ఈ సినిమాపై ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గకపోగా, అంచనాలు మరింత పెరగడం విశేషంగా కనిపిస్తోంది. గుణశేఖర్ కలల ప్రాజెక్ట్ అయిన ‘రుద్రమదేవి’ చాలాసార్లు వాయిదా పడుతూ వచ్చి చివరకు అక్టోబర్ 9వ తేదీకి ఫిక్స్ అయింది. భారతదేశపు మొట్టమొదటి ౩డీ బయోపిక్‌గా తెరకెక్కిన ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, మళయాల, హిందీ వర్షన్స్‌లో భారీ ఎత్తున విడుదల కాబోతోంది.
ఇక పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో జాప్యం కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా, ప్రస్తుతం ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని అనుకున్న తేదీకే విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ఇక నిన్న ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. సెన్సార్ బృందం ఈ సినిమాకు ఎటువంటి కట్స్ చెప్పకుండా యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. అనుష్క, రానా, అల్లు అర్జున్, నిత్యా మీనన్, కృష్ణం రాజు.. ఇలా భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమా కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని చాటిచెప్పే విజువల్ ఫీస్ట్‌గా నిలవనుందని తెలుస్తోంది.

