
వైవిధ్యభరితమైన కథాంశాలతో రూపొందిన సినిమాల్లో హీరోగా నటించి, ఇప్పుడున్న యువహీరోల్లో తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో సందీప్ కిషన్. తాజాగా ఆయన మరో యువహీరో రాహుల్ రవీంద్రన్‌తో కలిసి ‘టైగర్’ సినిమాతో మనముందుకు రానున్న సంగతి తెలిసిందే! ఇప్పటికే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈనెల 26న విడుదలకు సిద్ధమైంది. ప్రేమ, స్నేహం నేపథ్యంలో మూడు ప్రధాన పాత్రల చుట్టూ తిరిగే ఈ సినిమాకు ఈ పాయింటే మేజర్ హైలైట్‌గా నిలవనుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా రన్ టైమ్ సినిమాకు మరో విశేషంగా కనిపిస్తోంది.
గత కొన్నాళ్ళుగా తెలుగుతో పాటు అన్ని భాషల ప్రేక్షకులూ రన్‌టైమ్‌ను ప్రధాన అంశంగా చూస్తున్నారు. అవసరమైతేనే తప్ప కథలో విపరీతమైన డీటైలింగ్‌ను ప్రేక్షకులు కోరుకోవడం లేదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని టైగర్ టీమ్, ఈ సినిమాను వీలైనంత క్రిస్పీగా చెప్పే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఇక రెండు గంటలకు రెండు నిమిషాలు తక్కువే ఉండే రన్‌టైమ్ వల్ల సినిమా చాలా వేగంగా నడుస్తుందని, ప్రేక్షకులు ఇలాంటి కమర్షియల్ సినిమాల్లో ఈ స్పీడ్ నెరేషన్‌కు బాగా కనెక్ట్ అవుతారని టైగర్ యూనిట్ చెబుతోంది. ఇక ఈ సినిమా రన్‌టైమ్ ఫస్టాఫ్ 1 గంట ౦8 నిమిషాలు కాగా, సెకండాఫ్ 50 నిమిషాలే! శీరత్ కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను ఠాగూర్ మధు, ఎన్.వి.ప్రసాద్‌లు నిర్మించారు.

