ఔంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నటించిన పవర్ఫుల్ పోలీస్ డ్రామా ‘టెంపర్’. గత శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగులో సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాని పూరి జగన్నాధ్ – బండ్ల గణేష్ కలిసి బాలీవుడ్ లో రీమేక్ చెయ్యనున్నారని ఇది వరకే తెలియజేశాం. తాజా సమాచారం ప్రకారం ఈ బాలీవుడ్ రీమేక్ లో సచిన్ జోషి హీరోగా నటిస్తాడని అంటున్నారు. ఈ రీమేక్ వెర్షన్ ని ఒకేసారి హిందీ – తమిళ భాషల్లో తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. సచిన్ జోషి – బండ్ల గణేష్ కి మంచి సాన్నిహిత్యం ఉంది.
సచిన్ జోషి నటించిన చివరి సినిమా ‘నీ జతగా నేనుండాలి’ సినిమాని కూడా బండ్ల గణేష్ నిర్మించాడు. వీరిద్దరి మధ్య ఉన్న ఈ సాన్నిహిత్యం వలనే బండ్ల గణేష్ హిందీలో రీమేక్ చేయడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. సచిన్ జోషి కూడా బాలీవుడ్ లో ఓ మంచి హిట్ తో తనని తానూ నిరూపించుకోవాలని ట్రై చేస్తున్నాడు. ఈ రీమేక్ తో తను కోరుకునే హిట్ అందుకుంటానని సచిన్ నమ్మకంగా ఉన్నాడు. త్వరలోనే ఈ రీమేక్ గురించిన పూర్తి వివరాలు తెలుస్తాయి. ఇదిలా ఉంటే టెంపర్ బాక్స్ ఆఫీసు వద్ద స్ట్రాంగ్ కలెక్షన్స్ రాబట్టుకుంటోంది.


