సంచలన హీరో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబుతో, వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమా తీస్తే ఎలా ఉంటుంది? వినడానికే ఈ కాంబినేషన్ చాలా గమ్మత్తుగా ఉంది కదూ? మరి అది తెరకెక్కితే! ‘హృదయకాలేయం’ సినిమాతో సినీపరిశ్రమకు పరిచయమైన సోషల్ మీడియా సెన్సేషన్ సంపూర్ణేష్ బాబు. తాజాగా ‘సింగం 123’ అంటూ మరో సినిమా ద్వారా సిద్ధమయ్యాడు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు ఈ సినిమాను తెరకెక్కించడం విశేషం. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సెన్సేషన్ సృష్టిస్తోంది.
తాజాగా ఇలాంటి సెన్సేషన్ స్టార్‌కు వివాదాల దర్శకుడు తోడవనున్నట్లు ప్రచారం జరుగుతోంది. రామ్ గోపాల్ వర్మ హర్రర్ తరహా సినిమాలకు పెట్టింది పేరన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకూ ఎవ్వరూ టచ్ చేయని హర్రర్ కామెడీలోని ఓ కొత్త జానర్లో ఈ సినిమా తెరకెక్కనుందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వరుసగా సినిమాలను అనౌన్స్ చేస్తూ వెళుతోన్న వర్మ ఆ లైన్లో ఈ సినిమాను కూడా ఉంచాడట. ఇది ఎంతవరకు నిజమన్నది ఇప్పుడే చెప్పలేం. అయితే.. ఈ కాంబినేషన్ నిజంగా తెరకెక్కితే గనుక కచ్చితంగా మరో సంచలనమే!


