చిరంజీవి సూపర్ హిట్ టైటిల్‌తో ‘కమిటీ కుర్రోళ్లు’ హీరో.. ‘వేట’ మూవీ లాంచ్

చిరంజీవి సూపర్ హిట్ టైటిల్‌తో ‘కమిటీ కుర్రోళ్లు’ హీరో.. ‘వేట’ మూవీ లాంచ్

Published on Aug 31, 2026 6:44 PM IST

‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో మెప్పించిన యువ నటుడు సందీప్ సరోజ్, సాత్విక జంటగా కొత్త చిత్రం ‘వేట’ లాంఛనంగా ప్రారంభమైంది. ఎస్ఆర్‌డి ప్రొడక్షన్స్, ఈటీవీ విన్ సంయుక్త నిర్మాణంలో ఫణి అడపాక, జయలక్ష్మీ అడపాక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అశోక్ కోటిపల్లి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సోమవారం నాడు జరిగిన ఈ ప్రారంభోత్సవ వేడుకకు టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.

ముహూర్తపు సన్నివేశానికి కొణిదెల నాగబాబు స్క్రిప్ట్ అందించగా, సీనియర్ దర్శకుడు-నటుడు కేఎస్ రవి కుమార్ క్లాప్ కొట్టారు. సాయి రాజేష్, ఎస్‌కేఎన్, వీఎన్ ఆదిత్య, నిర్మాత ఫణి అడపాక కెమెరా స్విచ్ ఆన్ చేయగా.. మెహర్ రమేష్, యదు వంశీ, అనుదీప్ దేవ్ తదితరులు పాల్గొని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

తన కెరీర్‌లో ‘వేట’ కథ ఎంతో సరిగ్గా సరిపోతుందని హీరో సందీప్ సరోజ్ పేర్కొన్నారు. ఈ చిత్రంలో తాను ఊరి పెద్ద మనిషి తరహా ప్రాధాన్యమున్న పాత్రలో కనిపించనున్నట్లు కేఎస్ రవి కుమార్ వెల్లడించారు. కథ వినగానే చాలా నచ్చిందని, నేటి తరం ప్రేక్షకులను సైతం ఆకట్టుకునే అంశాలు ఇందులో ఉన్నాయని ఆయన తెలిపారు.

గ్రామీణ నేపథ్యంలో సహజత్వంతో పాటు కమర్షియల్ హంగులతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు నిర్మాత ఫణి అడపాక తెలిపారు. ఈటీవీ విన్‌తో కలిసి చేస్తున్న మూడో ప్రాజెక్ట్ ఇదని, కొత్త దర్శకుడు అశోక్ కోటిపల్లి కథను అద్భుతంగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. హీరోయిన్ సాత్విక మాట్లాడుతూ, ఈ ప్రాజెక్ట్ తన కెరీర్‌లో మంచి ఆరంభం అవుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు