సంక్రాంతి సినిమా పండుగ క్రిస్మస్ నుంచే మొదలు..!

సంక్రాంతి సినిమా పండుగ క్రిస్మస్ నుంచే మొదలు..!

Published on Dec 14, 2015 8:31 PM IST

Nannaku-Prematho
దసరా, సంక్రాంతి, వేసవి.. ఈ మూడు సీజన్లూ తెలుగు సినిమా బాక్సాఫీస్‌కు పండుగ కళను తీసుకొచ్చే సీజన్లుగా చెప్పుకోవచ్చు. ఈ సీజన్‌లో తమ సినిమాలు విడుదలయితే బాగుంటుందని అందరూ కోరుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ప్రతిసారీ ఈ సీజన్లలో సినిమాల హడావుడి మామూలుగా ఉండదు. తాజాగా ఈ సంక్రాంతి సీజన్‌కూ సినిమాల సందడి ఓ రేంజ్‌లో ఉండనుంది. పలు క్రేజీ సినిమాలు సంక్రాంతి సీజన్‌లో పోటీలో నిలిచేందుకు సిద్ధమైపోయాయి.

అయితే ఈ సంక్రాంతి సీజన్ సినిమాలకు మరో ప్రత్యేకత కూడా ఉంది. అదే ఈ సీజన్ సందడి ఈ నెలాఖరు నుంచే మొదలుకానుండడం. వాస్తవానికి సంక్రాంతి సీజన్ అంటే కొత్త సంవత్సరం వారం నుంచో, ఆ తర్వాతి వారం నుంచో మొదలవుతుంది. ఈ సారి మాత్రం ఇంకాస్త ముందునుంచే అంటే క్రిస్మస్ నుంచే మొదలుకానుండడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ సారి క్రిస్మస్‌కు ఏకంగా ఆరు క్రేజీ సినిమాలు రానుండడంతో సంక్రాంతి సందడి అప్పట్నుంచే మొదలుకానుంది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25 సూర్య నటించిన ‘మేము’, అల్లరి నరేష్-మోహన్ బాబుల ‘మామ మంచు అల్లుడు కంచు’, గోపీచంద్ ‘సౌఖ్యం’, నాగ శౌర్య ‘అబ్బాయితో అమ్మాయి’, సుధీర్ బాబు ‘భలే మంచి రోజు’, వారాహి సంస్థ విడుదల చేయనున్న ‘జతకలిసే’ ఒకేసారి విడుదల కానున్నాయి.

ఇక ఆ తరువాతి వారం కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని జనవరి 1న రామ్ హీరోగా నటించిన ‘నేను.. శైలజ’, రాజమౌళి శిష్యుడి దర్శకత్వంలో రూపొందిన ‘లోల్’ సినిమాలు విడుదల కానున్నాయి. ఇక జనవరి 1 రిలీజ్ అయ్యే దిశగా మరికొన్ని ఇతర సినిమాలు కూడా ప్లాన్ చేసుకుంటూన్నాయి. దీంతో జనవరి మొదటివారం కూడా సినిమా కళ అలాగే కొనసాగనుంది. ఇక ఆ తర్వాత మొదలయ్యే అసలైన సంక్రాంతి వారానికి ‘నాన్నకు ప్రేమతో’, ‘డిక్టేటర్’, ‘సోగ్గాడే చిన్ని నాయనా’, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ లాంటి పలు క్రేజీ సినిమాలు రానున్నాయి. జనవరి 13న నాన్నకు ప్రేమతో సినిమా అసలైన సంక్రాంతి పోరుకు తెరలేపనుంది. ఇక అప్పుడే ఈ పదిహేను రోజుల పాటు విడుదలయ్యే సినిమాలతో ఒకస్థాయి సంక్రాంతి సందడి మొదలైతే నాన్నకు ప్రేమతో రిలీజ్‌తో అది తారాస్థాయికి వెళ్ళనుంది. ఇక ఇలా నెలరోజుల పాటు వరుసగా పలు క్రేజీ సినిమాలతో సంక్రాంతి సందడి క్రిస్మస్ నుంచే మొదలు కానుండడం విశేషంగా చెప్పుకోవచ్చు. మరి ఈ సినిమా పండుగలో ఏయే సినిమాలు ఏయే రేంజ్‌లో మెప్పిస్తాయో చూడాలి.

తాజా వార్తలు