మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా మారుతీ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం “ప్రతి రోజు పండగే”. ఇటివలే ఈ చిత్ర యూనిట్ న్యూయార్క్‌లో కీలకమైన షెడ్యూల్ ను పూర్తి చేసింది, దాంతో ఈ సినిమాకి సంబంధించి చిన్న ప్యాచ్ వర్క్ మినహా ఈ సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తయింది. కాగా చిత్రబృందం ప్రస్తుతం హైదరాబాద్‌లో విలాసవంతమైన సెట్‌ను నిర్మిస్తోంది, ఈ సెట్ లో సాయి తేజ్ మరియు రాశిల పై ఓ పెప్పీ సాంగ్ ను చిత్రీకరించనున్నారు. ఈ సాంగ్ తో సినిమా షూటింగ్ పార్ట్ పూర్తి కానుంది.
ఇక క్రిష్టమస్ సందర్భంగా డిసెంబర్ 20న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. పల్లెటూరి నేపథ్యంలో సాగే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో ధరమ్ తేజ్ సరసన రాశి ఖన్నా నటిస్తున్నారు. గతంలో వీరిద్దరూ “సుప్రీం” సినిమాలో కలిసి నటించడం జరిగింది. ఇక మిగిలిన కీలక పాత్రల్లో సత్యరాజ్, విజయ కుమార్, రావ్ రమేష్, మురళీ శర్మ తదితరులు నటిస్తుండగా, అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.


