టాలీవుడ్‌లో తనదైన క్లాస్ మరియు సెన్సిబుల్ చిత్రాలతో కుటుంబ ప్రేక్షకులని, ఓవర్సీస్ ఆడియన్స్‌ను ఎంతగానో ఆకట్టుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల. ఆయన ధనుష్ హీరోగా తెరకెక్కించిన ‘కుబేర’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇక దాదాపు ఏడాది కాలం పాటు శ్రమించిన ఆయన ఇప్పుడు ఒక అద్భుతమైన స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారట.
ఏషియన్ సునీల్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కడం ఖాయమైనప్పటికీ, హీరోగా ఎవరు నటిస్తారనే విషయంపై క్లారిటీ లేదని తెలుస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్‌లోని టాప్ మరియు యంగ్ హీరోలందరూ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండటమే దీనికి కారణం. దీంతో శేఖర్ కమ్ముల పలువురు హీరోలను కలిసి ఈ కొత్త స్క్రిప్ట్‌ను వినిపించేందుకు సమావేశాలు ప్లాన్ చేస్తున్నాడట. టాలీవుడ్‌లోనే కాకుండా ఇతర భాషల హీరోలను కూడా సంప్రదించే ఆలోచనలో ఆయన ఉన్నారు.
అయితే, శేఖర్ కమ్ముల వర్కింగ్ స్టైల్ ప్రకారం ఆయన సెట్స్‌పై ఎక్కువ సమయం కేటాయిస్తారు. సినిమా పర్ఫెక్ట్‌గా వచ్చేంతవరకు అస్సలు రాజీపడరు. దీనివల్ల ఆయనతో సినిమా చేసే హీరో దాదాపు ఏడాది పాటు ఈ ప్రాజెక్ట్‌కే సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది. మరి శేఖర్ కమ్ముల లాంటి క్లాస్ డైరెక్టర్‌తో వర్క్ చేసే ఈ ఛాన్స్ ఎవరు అందుకుంటారో చూడాలి.


