విషాదం : ప్రముఖ నటుడు ఇకలేరు !

విషాదం : ప్రముఖ నటుడు ఇకలేరు !

Published on Oct 25, 2021 8:33 AM IST

తెలుగు సినిమా, టీవీ, రంగస్థల నటుడు రాజబాబు ఇక లేరు . గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు . ఆయన వయసు 64 సంవత్సరాలు. రాజబాబుకు భార్య , ఇద్దరు మగపిల్లలు ,ఒక అమ్మాయి వున్నారు. రాజబాబును అందరూ బాబాయ్ అని ఆప్యాయంగా పిలుస్తారు . తెర మీద గంభీరంగా కనిపించే రాజబాబు నిత్య జీవితంలో చాలా సరదా మనిషి .తన చుట్టూ వున్న వారిని హాయిగా నవ్విస్తూ ఉండే రాజా బాబు మరణించారన్న వార్త దిగ్బ్రాంతి కలిగించింది.

రాజబాబు , తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మండలం నరసాపుర పేట లో 13 జూన్ 1957లో జన్మించారు . ఆయన తండ్రి పేరు రామతారకం . ఆయన చిత్ర నిర్మాత నటుడు . దాసరి నారాయణ రావు దర్శకత్వంలో “స్వర్గం -నరకం”, “రాధమ్మ పెళ్లి ” సినిమాలను నిర్మించారు. కాకినాడలో స్థిరపడిన రాజబాబు కు వ్యవసాయం చెయ్యడమన్నా, కబడే ఆడటమన్నా , రంగస్థల మీద నటించడమన్నా ఎంతో ఇష్టం . చిన్నప్పటి నుంచి నాటకాలు వేస్తూ దేశమంతా తిరిగారు . దర్శకుడు ఉప్పలపాటి నారాయణ రావు రాజబాబును 1995లో “ఊరికి మొనగాడు ” అన్న సినిమాలో అవకాశం ఇచ్చి సినిమా రంగానికి పరిచయం చేశారు .

ఆ తరువాత సిందూరం సినిమా తర్వాత రాజబాబును అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి . కాకినాడ నుంచి రాజబాబు హైదరాబాద్ కు మకాం మార్చి సినిమా రంగంపై దృష్టి పెట్టారు .ఆనతి కాలంలోనే రాజబాబు , సముద్రం ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, మురారి, శ్రీకారం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సముద్రం, కళ్యాణ వైభోగం, మళ్ళీ రావా ?, శ్రీకారం , బ్రమ్మోత్సవం, భరత్ అనే మొదలైన 62 చిత్రాల్లో విభిన్నమైన పాత్రలను పోషించారు. సినిమాతో పాటు టీవీ రంగంలో కూడా రాజబాబు నటించారు. వసంత కోకిల, అభిషేకం , రాధా మధు, మనసు మమత సీరియల్స్ లో పోషించిన పాత్రలు రాజబాబు కు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి.

2005వ సంవత్సరంలో “అమ్మ ” సీరియల్ లోని పాత్రకు నంది అవార్డు వచ్చింది. రాజబాబును కాకినాడలో ఘనంగా సత్కరించారు . రాజబాబు కు పుట్టి పెరిగిన వూరు అంటే ఎంతో ఇష్టం , సంక్రాంతికి కాకినాడ వెళ్లి మిత్రులతో సరదాగా గడుపుతూ , కోడి పందాలలో పాల్గొనేవాడు . సినిమా రంగంలోనూ , టీవీ రంగంలోనూ రాజబాబుకు ఎంతో మంది స్నేహితులు , ఆత్మీయులు వున్నారు . తెలుగు తనాన్ని తెరమీద పంచి తెర మెరుగైన రాజబాబు ఎప్పటికీ తన పాత్రల ద్వారా చిరంజీవిగా వుంటారు , 123తెలుగు.కామ్ తరఫున రాజబాబు మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు