
సౌత్ ఇండియాలో ఉన్న టాప్ ప్రొడక్షన్ హౌస్ లలో ఎ.ఎం. రత్నం నిర్మించిన శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ ఒకటి. సూర్యా మూవీస్ బ్యానర్ లో శంకర్ డైరెక్షన్ లో భారతీయుడు, ఒకే ఒక్కడు లాంటి సినిమాలతో పాటు పవన్ కళ్యాణ్ ఖుషీ తో పాటు 7/జి బృందావన కాలనీ లాంటి పలు సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. ఈ మధ్య కాలంలో సినిమాలు చేయడం తగ్గించిన ఎఎం రత్నం మళ్ళీ అజిత్ స్టార్ హీరోగా ‘వెదాలం’ సినిమా చేసాడు.
ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 10న రీలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న ఎఎం రత్నం భారతీయుడు సీక్వెల్ కి సంబందించిన క్రేజీ విషయాన్ని తెలియజేశాడు. భారతీయుడు సినిమాకి కచ్చితంగా సీక్వెల్ అనేది ఉంటుంది. కమల్ హాసన్ హే రామ్ టైం లోనే భారతీయుడు సీక్వెల్ చేద్దామని అన్నాడు, కానీ దానికి పర్ఫెక్ట్ కథ దొరకక పోవడంతో హోల్డ్ లో పెట్టాం. కచ్చితంగా భారతీయుడుకి సీక్వెల్ ఉంటుంది. ఇటీవలే ఈ విషయంపై శంకర్ తో కూడా చర్చలు జరిపామని ఎఎం రత్నం తెలిపాడు. ఇదిలా ఉంటే వెదాలం సినిమాని తెలుగులో కూడా ఆవేశం అనే పేరుతో రిలీజ్ చేయనున్నారు.

