
హ్యాట్రిక్ హిట్స్‌తో జోరు మీదున్న నిఖిల్ అదే జోరును కొనసాగించాలన్న ఆలోచనతో శంకరాభరణం అన్న సినిమాతో మనముందుకు వచ్చిన విషయం తెలిసిందే. గత కొద్దికాలంగా టాలీవుడ్‌లో క్రేజీ ప్రాజెక్టుల్లో ఒకటిగా చెప్పబడుతూ వచ్చిన ఈ సినిమా నిన్న పెద్ద ఎత్తున థియేటర్లలో వాలిపోయింది. హ్యాట్రిక్ హిట్స్‌తో ఉన్న నిఖిల్ సినిమా కావడం, ప్రముఖ రచయిత కోనవెంకట్ కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందించడంతో పాటు అన్నీ తానై నిర్మించడంతో ‘శంకరాభరణం’ సినిమాకు మొదట్నుంచే మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
ఇక ఆ అంచనాలకు తగ్గట్టుగానే నిన్న విడుదలైన ఈ సినిమా నిఖిల్ కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించింది. ఓవర్సీస్‌తో సహా అన్ని ప్రాంతాల్లో కలుపుకొని మొదటి రోజు ఈ సినిమా 1.68 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఉదయ్ నందనవనం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు విడుదల రోజే మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చినా కలెక్షన్స్ మాత్రం బాగున్నాయి. ఇక ఈ వీకెండ్ కూడా కలెక్షన్స్ ఇదే రేంజ్‌లో ఉంటాయని తెలుస్తోంది. ఆ తర్వాత కలెక్షన్స్ ఎలా ఉంటాయన్న దానిపై సినిమా రిజల్ట్ ఆధారపడి ఉంది. నిఖిల్ సరసన నందిత హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో అంజలి ఓ కీరోల్ చేశారు.

