
గత కొద్దిరోజులుగా చెన్నై నగరాన్ని వణికిస్తోన్న భారీ వర్షాల వల్ల ఇబ్బందులు పడుతోన్న బాధితులను ఆదుకునేందుకు పలువురు స్టార్స్ ఇప్పటికే ముందుకు వచ్చి తమ వంతు సాయం చేస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో నిఖిల్ ‘శంకరాభరణం’ టీమ్ కూడా చేరిపోవడం విశేషంగా చెప్పుకోవచ్చు. కోన వెంకట్ నిర్మాణంలో రూపొందిన ‘శంకరాభరణం’ సినిమా యూనిట్ చెన్నై బాధితులకు అండగా నిలబడుతూ 5 లక్షల రూపాయలతో ఆహారం, వైద్య సదుపాయాలు కల్పించనున్నారు.
చెన్నైలో ప్రస్తుతం బాధితుల సహాయ చర్యల్లో పాలు పంచుకుంటున్న ఓ ఎన్జీఓ ద్వారా ఈ మొత్తాన్ని శంకరాభరణం టీమ్ ఖర్చు పెడుతోంది. కొత్త దర్శకుడు ఉదయ్ నందనవనం దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదలకు సిద్ధమవుతోంది. నిఖిల్ సరసన నందిత హీరోయిన్‌గా నటించగా, అంజలి ఓ కీలక పాత్రలో నటించారు. ఇక కష్టాల్లో ఉన్న చెన్నై వరద బాధితులకు అండగా నిలబడి ఆదుకోవడం తమ బాధ్యతగా భావించి ఈ ఆలోచన చేశామని నిఖిల్ తెలిపారు. ఒక సినిమా యూనిట్ చెన్నై బాధితుల సహాయార్థం ఇలా ముందుకు వచ్చి వారికి అండగా నిలబడడం ఆహ్వానించదగ్గ విషయంగా చెప్పుకోవచ్చు.

