చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై వేణు దోనేపూడి నిర్మిస్తున్న న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’. గుణి మంచికంటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర టీజర్‌ను శుక్రవారం ప్రముఖ స్టార్ హీరో శర్వానంద్ విడుదల చేసి, చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. దోనేపూడి చక్రపాణి ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.
ఒక రోజు జరిగిన అనుకోని సంఘటన ఆరుగురు వ్యక్తుల జీవితాలను ఎలా మార్చేసిందనే వైవిధ్యమైన కథాంశంతో ఈ సినిమా రూపొందింది. తాజాగా విడుదలైన టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఒక బాక్స్, తుపాకీ చుట్టూ తిరిగే ఈ కథలో మాఫియా డాన్‌గా ఉపేంద్ర లిమాయే, చెఫ్ లుక్‌లో అక్షయ్, ఇతర కీలక పాత్రల్లో విష్ణు, టిను ఆనంద్, జార్జ్ మరియన్ తదితరులు కనిపిస్తున్నారు. కార్ చేజింగ్, గన్ ఫైరింగ్ సన్నివేశాలతో పాటు మేఘాలయ ప్రకృతి అందాలు టీజర్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
ఈ సందర్భంగా నిర్మాత వేణు దోనేపూడి మాట్లాడుతూ.. “పూర్తిగా మేఘాలయాలో షూటింగ్ జరుపుకున్న తొలి సినిమా ఇదే. చిరపుంజి వంటి అద్భుతమైన లొకేషన్లలో తక్కువ రోజుల్లోనే చిత్రీకరణ పూర్తి చేశాం” అని తెలిపారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు.


