మోహన్ బాబు తనయుడు, హీరో మంచు విష్ణు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై నిర్మిస్తోన్న ఔట్ అండ్ ఔట్ స్పూఫ్ కామెడీ సినిమా ‘సింగం 123’. ‘సింగం 123’ సినిమాకు విష్ణు స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే అందించిన విషయం తెలిసిందే. బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. సంపూర్ణేష్ బాబు పేరడీ సన్నివేశాలు, డైలాగులు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని తెలుస్తోంది.
ఇక అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా రేపు (జూన్ 5న) విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా థియేటర్లలోనే కాక ఆన్‌లైన్లోనూ రేపే విడుదల కానుండడం విశేషంగా కనిపిస్తోంది. పే పర్ విజిట్ ప్రకారం ఆన్‌లైన్లో డబ్బులు చెల్లించి ఈ సినిమాను చూడొచ్చు. అయితే ఈ సదుపాయం కేవలం ఇండియా బయటి దేశాల వారికే పరిమితం. మొదటిసారి ఒక సినిమా డిస్త్రిబ్యూషన్‌లో ఈ ప్రయోగం చేస్తున్నామని మంచు విష్ణు ఈ సందర్భంగా తెలిపారు.


