
తెలుగు సినీ పరిశ్రమకు ‘ఆదిత్య 369’, ‘భైరవ ద్వీపం’ లాంటి పలు ఆణిముత్యాల్లాంటి సినిమాలను అందించిన సింగీతం శ్రీనివాసరావు, ఎనభై ఏళ్ళు దాటినా అదే ఉత్సాహంతో దర్శకత్వం వహిస్తూ ఈతరం దర్శకులకు ఆదర్శంగా నిలుస్తూ వస్తున్నారు. తాజాగా ఈ క్లాసిక్ దర్శకుడికి ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఓ అరుదైన గౌరవాన్నిచ్చింది. గోవాలో ఈ నెల 20వ తేదీ నుండి 30వ తేదీ వరకు వైభవంగా జరిగే వేడుకలో ఓ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి సింగీతం శ్రీనివాసరావును ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వాహకులు ప్రత్యేకంగా ఆహ్వానించారు.
ఈనెల 25వ తేదీన ఈ ప్రత్యేక చర్చా కార్యక్రమం జరుగనుంది. ఇందులో పలు అంతర్జాతీయ సినీ పరిశ్రమ నుంచి వచ్చిన సినీ ప్రముఖులతో ఇండియన్ సినిమాలోని ప్రఖ్యాత దర్శకులు తమ ఆలోచనలను పంచుకుంటారు. సింగీతం శ్రీనివాసరావుతో పాటు శ్యామ్ బెనెగల్, మధుర్ బండాడ్కర్, రాజ్‌కుమార్ హిరాణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. సినిమా గురించి సింగీతం శ్రీనివాసరావు లాంటి క్లాసిక్ దర్శకుడితో ఆలోచనలను పంచుకునే అవకాశం గోవా ఫెస్టివల్ కల్పించడం పట్ల ప్యానెల్‌లో పాల్గొనే ఇతర దర్శకులు సంతోషం వ్యక్తం చేశారు. ఇక నవంబర్ 24వ తేదీన సింగీతం దర్శకత్వంలో రూపొందిన క్లాసిక్ ‘అపూర్వ సహోదరర్గళ్’ ఈ ఫెస్టివల్‌లో ప్రదర్శితం కానుంది.

