సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యే సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి పోటీ పడుతాయో మనకి తెలుసు. తమిళ హీరో విజయ్ నటిస్తున్న ‘జనా నాయగన్’ సినిమాతో ఆయన సినిమాలకు వీడ్కోలు చెప్పనున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ సూపర్ హిట్ భగవంత్ కేసరి ఆధారంగా తెరకెక్కుతున్న ఈ రాజకీయ యాక్షన్ డ్రామాకు హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం 2026 జనవరి 9న పొంగల్ సందర్భంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఇదిలా ఉండగా, కోలీవుడ్ నుంచి శివకార్తికేయన్ నటించిన ‘పరాశక్తి’ కూడా పొంగల్ రేసులోకి దిగుతోంది. సుధా కొంగర దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను తొలుత జనవరి 14న విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే తాజా చర్చల ప్రకారం, ఈ సినిమా విడుదల తేదీ ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న బలమైన టాక్ ప్రకారం, పరాశక్తి జనవరి 10న అంటే జన నాయగన్ విడుదలైన మరుసటి రోజే థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది. అలా జరిగితే థియేటర్లు రెండు సినిమాల మధ్య విభజించబడే ప్రమాదం ఉంది. పైగా పరాశక్తికి మంచి టాక్ వస్తే, విజయ్ చివరి సినిమాకు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశముంది. ఈ పొంగల్ క్లాష్ చివరికి ఎలా మారుతుందో చూడాలి.


