ఫిల్మ్‌ ఛాంబర్ వద్ద స్లాబ్ కూలి పలువురు మృతి

24th, July 2016 - 12:56:55 PM

fnccc

తెలుగు సినీ పరిశ్రమలోని నిర్మాతల మండలి, పైరసీ సెల్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లాంటి చాలా కార్యాలయాలను నిలుపుకొని ఇండస్ట్రీ సమస్యలను పరిష్కరించేందుకు వేదికగా ఉన్న ఫిల్మ్ ఛాంబర్ వద్ద ఈ ఉదయం పెద్ద ప్రమాదం జరిగింది. ఫిల్మ్ ఛాంబర్ భవన సముదాయంలోని ఫిల్మ్‌నగర్ కల్చరల్ సొసైటిలో కొద్దిరోజులుగా నిర్మాణంలో ఉన్న ఓ భవనానికి సంబంధించిన స్లాబ్ కూలి దాని కింద పనిచేస్తోన్న కూలీలపై పడింది. ఈ ప్రమాదంలో అక్కడ ఆ సమయానికి ఉన్న ఇద్దరు ప్రాణాలు విడిచినట్లు తెలుస్తోంది.

భద్రతా సిబ్బందితో పాటు, ఫిల్మ్ నగర్ పరిసరాల్లోని జనాలు ప్రస్తుతం అక్కడ చిక్కుకున్న వారిని రక్షించే పనిలో ఉన్నారు. స్లాబ్ కూలడంతో ఎంతమంది చనిపోయారన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ఇలా అనుకోకుండా సంభవించిన ఈ ప్రమాదంతో ఫిల్మ్ ఛాంబర్ పరిసరాల్లో విషాధ చాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులతో పాటు, ఛాంబర్ నిర్వాహకులంతా ప్రస్తుతం ప్రమాద స్థలానికి చేరుకుంటున్నారు.