ఈసారి దసరా పండుగ బాక్సాఫీస్ వద్ద భారీ సినిమాల పోటీకి వేదిక కాబోతోంది. ఇప్పటికే విక్టరీ వెంకటేష్ నటించిన ‘ఆదర్శ కుటుంబం’ చిత్రాన్ని అక్టోబర్ 2న విడుదలకు సిద్ధం చేయగా, సూపర్ స్టార్ రజినీకాంత్ ‘జైలర్ 2’ అక్టోబర్ 15న థియేటర్లలోకి వస్తుందని అధికారికంగా ప్రకటించారు. మరోవైపు విజయ్ దేవరకొండ నూతన చిత్రం ‘రణబాలి’ని అక్టోబర్ 16న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
చిరంజీవి ‘విశ్వంభర’ కూడా దసరా బరిలో ఉంటుందని ప్రచారం జరిగినప్పటికీ, తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా పండుగ రేసు నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యం వల్ల ‘జైలర్ 2’ విడుదల తేదీ మారే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. ఒకవేళ పనులు అనుకున్న సమయానికి పూర్తి కాకపోతే ఈ చిత్రాన్ని దీపావళికి వాయిదా వేసే యోచనలో నిర్మాతలు ఉన్నారు.
రాబోయే పది రోజుల్లో దీనిపై క్లారిటీ రానుంది. ఒకవేళ జైలర్ 2 రేసు నుండి తప్పుకుంటే, వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ సినిమా అక్టోబర్ 15కి మారే అవకాశం ఉంది. దీనివల్ల మిగతా సినిమాల విడుదల తేదీలలో కూడా మార్పులు చోటుచేసుకుంటాయి. రాబోయే రెండు వారాల్లో ఈ దసరా సినిమాల లైనప్‌పై సంపూర్ణ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


