సోనూ సూద్ నిజంగా ఒక యోధుడే

Published on Apr 29, 2021 12:00 am IST

కోవిడ్ సెకండ్ వేవ్ దేశంలో ఉధృతంగా ఉంది. రోజూ లక్షల కొద్దీ కేసులు నమోదవుతున్నాయి. ప్రతి రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి. దీంతో రియల్ హీరో సోనూ సూద్ గతంలో కంటే రెట్టింపు పనిచేస్తున్నారు. కోవిడ్ మొదటి వేవ్ సమయంలో దేశవ్యాప్తంగా ఎంతోమందికి చేయూతనిచ్చిన సోనూ సూద్ ఇప్పుడు సెకండ్ వేవ్ పరిస్థితుల్లో తన సేవా కార్యక్రమాలను మరింత విస్తరించారు. దేశం మొత్తం వ్యాపించిన ఆయన నెట్వర్క్ రాత్రీ పగలూ అనే తేడా లేకుండా ఆపదలో ఉన్నవారికి సహాయం చేస్తున్నారు.

దేశవ్యాప్తంగా ఎన్నో వేలమంది ఆసుపత్రిలో బెడ్స్ కోసం, ఆక్సిజన్ కోసం, మందులు, ప్లాస్మా, అంబులెన్స్ అంటూ అనేక అత్యవసరాల కోసం సోనూను సంప్రదిస్తున్నారు. సోనూ తన బృందంతో కలిసి వీలైనంతవరకు తన అవసరం ఉన్న ప్రతి ఒక్కరికీ సహాయం చేస్తూనే ఉన్నారు. ప్రజలు ఆసుపత్రి ముందు పడకల కోసం, ప్రాణవాయువు కోసం ఎదురు చూస్తుంటే వాళ్లను అలా చూస్తూ ఎలా నిద్రపోగలనని అంటున్న సోనూ ‘అర్థరాత్రి ఎన్నో ఫోన్‌కాల్స్‌ చేస్తున్నాను. ఆపదలో ఉన్న వారికి ఆసుపత్రిలో బెడ్‌, ప్రాణ వాయువు దొరకడంతో కొద్దిమంది ప్రాణాలైనా కాపాడగలిగితే అది రూ.100 కోట్ల చిత్రంలో పనిచేయడం కంటే లక్షల రెట్లు సంతృప్తినిస్తుంది. నా నుంచి సాయం అందనివారు క్షమించాలి’ అంటూ ట్వీట్ చేశారు. రోజూ వందల మందికి సహాయం చేస్తూనే తాను సహాయం అందించలేకపోయినవారిని క్షమించమంటూ అడగడం చూస్తే సోనూ సంస్కారం ఎంత గొప్పదో అర్థమవుతుంది.

సంబంధిత సమాచారం :