లాక్ డౌన్ కారణంగా అన్ని భాషలు సినీ పరిశ్రమలు మూతబడ్డాయి. థియేటర్లు క్లోజ్ అయ్యాయి. ఇండస్ట్రీ లాక్ అవడంతో అప్పటికే పూర్తైన సినిమాలను ఓటీటీలకు అమ్మేశారు నిర్మాతలు. లాక్ డౌన్ అనంతరం చిత్రీకరణలకు అనుమతులిచ్చినా పెద్ద హీరోల సినిమాలు ఇంకా పూర్తి కాలేదు. వెబ్ సిరీస్ లు మాత్రమే అడపాదడపా వస్తున్నాయి. కొన్ని సినిమాలు పూర్తైనా సినిమా హాళ్లు పూర్తి స్థాయిలో తెరచుకున్నాకే విడుదలచేయాలని నిలిపి పెట్టుకున్నారు కొందరు నిర్మాతలు.
దీంతో థియేటర్లు కొన్ని తెరుచుకున్నప్పటికీ ప్రదర్శించడానికి హిందీ సినిమాలు కరువయ్యాయి. దీంతో అక్కడి ఎగ్జిబిటర్లు సౌత్ సినిమాల మీద దృష్టి పెట్టారు. ఇక్కడి హీరోలతో రూపొందిన మాస్ ఎంటెర్టైనర్లను హిందీలోకి డబ్ చేసుకుని రిలీజ్ చేస్తున్నారు. అనూహ్యంగా ఆ డబ్బింగ్ చిత్రాలు మంచి వసూళ్లను రాబడుతున్నాయి. స్ట్రయిట్ హిందీ సినిమాలకంటే ఎక్కువ టికెట్లు ఈ డబ్బింగ్ చిత్రాలకే తెగుతున్నాయి.ఢిల్లీ, బీహార్,ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ లాంటి చోట్ల మంచి ఆదరణ పొందుతున్నాయి. దాదాపు 70 శాతం థియేటర్లు దక్షిణాది సినిమాలనే నమ్ముకున్నాయట.
వాటిలో అల్లు అర్జున్ యొక్క’నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ కూడ ఉంది. మంచి మాస్ డోస్ కలిగిన ఈ సినిమాను హిందీ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే ధనుష్, రామ్ చరణ్, ఇంకొందరు హీరోల సినిమాలు అదే రీతిలో పెర్ఫార్మ్ చేస్తున్నాయి. దీంతో ఇంకొన్ని సౌత్ హీరోల మాస్ ఎంటెర్టైనర్లను డబ్ చేయడానికి సిద్దమవుతున్నారట అక్కడి డిస్ట్రిబ్యూటర్లు.


