చివరి పాటను కూడా ముగించేసిన మహేష్ !


మహేష్ బాబు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘స్పైడర్’. ఏ.ఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం చాలా రోజుల క్రితమే మొదలై, మధ్యలో ఒకసారి విడుదలను కూడా వాయిదావేసుకుంది. దీంతో ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహానికి గురయ్యారు. అందుకే ఈసారి మాత్రం టీమ్ చెప్పిన తేదీకే సినిమాను అందించాలని ఖచ్చితమైన షెడ్యూల్ ప్రకారం పనిచేసింది. కొద్దిరోజుల క్రితమే టాకీ పార్ట్ ను ముగించిన యూనిట్ చివరి పాట కోసం యూరప్ దేశమైన రోమానియాకు వెళ్ళింది.

తాజాగా ఆ పాట చిత్రీకరణ కూడా పూర్తైపోయింది. దీంతో షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టేసినట్లైంది. ఇక మహేష్ అండ్ టీమ్ ప్రచార కార్యక్రమాలపై దృష్టిపెట్టనున్నారు. ఇకపొతేసెప్టెంబర్ 9న చెన్నైలో జరగనున్న మహేష్ లాంచింగ్ ఈవెంట్లో చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. రూ. 100 కోట్ల పై చిలుకు బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాను సెప్టెంబర్ 27న రిలీజ్ చేయనున్నారు.