29 న నిర్మాత కొర్రపాటి సాయి అమృతేశ్వరాలయానికి రాజమౌళి, కేజీఎఫ్ యశ్, పురాణపండ, మంగ్లీ

29 న నిర్మాత కొర్రపాటి సాయి అమృతేశ్వరాలయానికి రాజమౌళి, కేజీఎఫ్ యశ్, పురాణపండ, మంగ్లీ

Published on Feb 26, 2024 6:45 AM IST

బళ్ళారి : ఫిబ్రవరి : 26

Sree Amrutheshwara Temple, Ballari, built by Sai Korrapati

దక్షిణ భారతదేశ చరిత్రలో ఒక మహోజ్వల ఘట్టానికి తెర తీశారు వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటి. భారత దేశానికి ఆస్కార్ ఘనతలు సాధించిపెట్టిన దర్శక ధీరుడు ఎస్. ఎస్. రాజమౌళికి , విఖ్యాత సంగీత దర్శకులు ఎం.ఎం. కీరవాణికి అత్యంత ఆత్మబంధువైన సాయి కొర్రపాటి సుమారు దశాబ్దం క్రితం రాజమౌళితో ఈగ వంటి విఖ్యాత చిత్రాన్ని నిర్మించి జాతీయ స్థాయిలో నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుండి అత్యున్నత పురస్కారం స్వీకరించారు కూడా.

కేవలం సినీ నిర్మాతగా మాత్రమే లక్షల మందికి తెలుసున్న సాయికొర్రపాటి గత రెండు సంవత్సరాలుగా చలన చిత్రాలు మానేశారని గుస గుసలాడుకునే వారి పెదవుల ముందు ఫుల్ స్టాప్ పెడుతూ తన స్వస్థలమైన బళ్ళారి లో సుమారు యిరవై ఐదు కోట్ల రూపాయల వ్యయంతో ఒక మహాద్భుతాన్ని సృష్టించి దేశాన్నే ఆశ్చర్య పరిచారు. దశాబ్దంక్రితం విఖ్యాత శైవ క్షేత్రం శ్రీశైల దేవస్థానంకి ప్రత్యేక సలహాదారునిగా వ్యవహరించి … తన జీవన సర్వస్వాన్ని భగవత్సేవకే అంకితం చేసుకున్న ప్రముఖ రచయిత , సాయి కొర్రపాటికి అత్యంత సన్నిహితులు పురాణపండ శ్రీనివాస్ ఈ ఆశ్చర్యంవెనుక వున్న అదృశ్య శక్తి అని ఇప్పటికే సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

SS Rajamouli-Puranapanda-srinivas-Yash-Singer-Mangli

దర్శకత్వ ప్రతిభతో పాటు ఆర్ధికబలం బలంగా వేళ్లూనుకున్న సన్నిహితులు రాజమౌళి , కీరవాణి అయితే … అస్సలు ఆర్ధికబలం లేని అసాధారణ ప్రతిభాశాలి పురాణపండ శ్రీనివాస్ కూడా సాయి కొర్రపాటికి మరొక ఆత్మబంధువు. శ్రీనివాస్ సాహచర్యమే ఈ ఆలయ అంకురార్పణకు కారణమైందని బసవన్న సాక్షిగా సన్నిహితులు చెబుతున్నారు. అతి అరుదైన కృష్ణ శిలతో సాయి కొర్రపాటి ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చుకుని నిర్మించిన వజ్ర సదృశ స్పటిక లింగ ప్రకాశంగా దర్శనమిస్తున్న ఈ ఆలయం పేరు “అమృతేశ్వర ఆలయం ”

ప్రపంచ శిలా నిర్మాణాల చరిత్రలో అత్యంత ప్రాధాన్యత వహించే కృష్ణ శిలా విశేషాలతో నిర్మించబడ్డ ఈ ఆలయం ఈ ఫిబ్రవరి 29 వ తేదీన మహా వైభవంగా పరమ శైవ సాంప్రదాయంలో ప్రారంభంకానుంది. బళ్లారికి సుమారు పదికిలోమీటర్ల దూరంలో బాలాజీనగర్లో అత్యంత ఉన్నతంగా దర్శనమిస్తున్న ఈ ఆలయంలో వున్నా కోనేరులో శ్రీకృష్ణ పరమాత్మ భారీ విగ్రహాన్ని ప్రతిష్టించబోతున్నారు. ఈ సంరంభం సందర్భంగా గత రెండు రోజులుగా ఆలయంలో హోమాలు, పూజలు ప్రారంభమయ్యాయి. మర్చి 1 వ తేదీ వరకూ ఈపూజలు కొనసాగుతాయి.

గుడి మొత్తం కృష్ణ శిలతో నిర్మితమవ్వడం ఒక విశేషమైతే ఈ ఆలయంలోకి అడుగు పెట్టగానే మధ్యలో పరమ గంభీరంగా దర్శనమిస్తారు బసవన్న నందీశ్వరుడు. గుడికి అన్ని వైపులా వినాయకుడు, అన్నపూర్ణమ్మ , శ్రీ నరసింహ స్వామి, కాలభైరవుడు. వారాహి మాతలు కొలువు తీరడం మరొక విశేషం. శుభకార్యాలకు కళ్యాణమంటపం, భక్తుల కోసం అన్నప్రసాద భవనం కూడా పరమేశ్వర అనుగ్రహంగా నిర్మించబడింది. ఆలయం చుట్టూ దేశంలో శివ స్వరూపాలైన ద్వాదశ జ్యోతిర్లింగాలలోతో పాటు, పదుల సంఖ్యలో నందులు భక్తులను విశేషంగా ఆకర్షిస్తాయి. ఆలయం ముందు భాగంలో సుమారు ముప్పై అడుగులతో వున్న ఆంజనేయుని భారీ విగ్రహం ఇంకో ఆకర్షణగా చెప్పాలి.

స్వయంభు క్షేత్రం కాకపోయినా … ఆ స్థాయిలో నిర్మించబడ్డ ఈ అమృతేశ్వర శివాలయం కొర్రపాటి సాయి కీర్తిని కర్ణాటక సాంస్కృతిక చరిత్రలోనే కాకుండా భారత దేశ ప్రఖ్యాత శైవాలయాల తొలి వరుసలో నిలబెడుతుంది ఇప్పటికే ఆలయం సందర్శకులు చెబుతున్నారు. 29 న మహా సంరంభంగా ఈ మహా లింగానికి శ్రీశ్రీ శ్రీ సచ్చిదానంద సరస్వతీ మహారాజ్ ప్రాణ ప్రతిష్ట చేస్తారనే వీడియో ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ ఉత్సవానికి దర్శక ధీరుడు రాజమౌళి, కీరవాణి, కేజీఎఫ్ రాకింగ్ స్టార్ యశ్, ప్రముఖ ప్లే బ్యాక్ సింగర్ మంగ్లీతో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొంటున్నట్లు కన్నడ మీడియా కూడా కోడై కూస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు