కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీవిష్ణు (Sree Vishnu) ప్రస్తుతం ఒక అరుదైన బాక్సాఫీస్ ఫైట్‌కు సిద్ధమవుతున్నాడు. ఒకే హీరో నటించిన రెండు వేర్వేరు సినిమాలు కేవలం 24 గంటల వ్యవధిలో విడుదల కావడం విశేషం. ఆయన నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘మృత్యుంజయ’ ఫిబ్రవరి 27న విడుదల కానుండగా, మరుసటి రోజే అంటే ఫిబ్రవరి 28న కామెడీ డ్రామా ‘విష్ణు విన్యాసం’ థియేటర్లలోకి రానుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ ఒక వైవిధ్యమైన పోస్టర్ ద్వారా అధికారిక ప్రకటన విడుదల చేసింది.
సాధారణంగా ఏ హీరో అయినా తన సినిమాల మధ్య కనీసం నెల రోజుల గ్యాప్ ఉండాలని కోరుకుంటాడు. కానీ ఇక్కడ శ్రీవిష్ణు (Sree Vishnu) ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం ఓటీటీ ఒప్పందాలే. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల నిబంధనలు సినిమా విడుదల తేదీలను శాసిస్తున్నాయి. ‘మృత్యుంజయ’ డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకోగా, ‘విష్ణు విన్యాసం’ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఒప్పందం ప్రకారం ఆయా ప్లాట్‌ఫారమ్‌లు సూచించిన తేదీలకే థియేటర్లలో రిలీజ్ చేయాలనే కఠిన నిబంధన ఉండటంతో ఈ ‘సెల్ఫ్ క్లాష్’ తప్పలేదు.
దీంతో ఈ నెల ఆఖరులో శ్రీవిష్ణు వర్సెస్ శ్రీవిష్ణు వార్‌ను ప్రేక్షకులు చూడబోతున్నారు. ఒకవైపు సీరియస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌తో, మరోవైపు తనదైన శైలి వినోదంతో ఆయన ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఈ రెండు సినిమాల ప్రమోషన్లను శ్రీవిష్ణు ఎలా బ్యాలెన్స్ చేస్తారో, అలాగే బాక్సాఫీస్ వద్ద ఏ చిత్రం పైచేయి సాధిస్తుందో చూడాలి. వరుస విజయాలతో ఊపుమీదున్న శ్రీవిష్ణుకు ఈ డబుల్ రిలీజ్ ఏ మేరకు కలిసివస్తుందో వేచి చూడాల్సిందే.


