
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందిన ‘శ్రీమంతుడు’ నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన విషయం తెలిసిందే. ఇక అంతా అనుకున్నట్లుగానే మొదటిరోజు ఈ సినిమా అన్ని చోట్లా కలెక్షన్లు కుమ్మేసింది. రెండు వరుస పరాజయాల తర్వాత మహేష్ ఈసారి కచ్చితంగా హిట్ కొడతాడన్న నేపథ్యంలో వచ్చిన ‘శ్రీమంతుడు’ సినిమాపై మొదట్నుంచీ భారీ అంచనాలున్నాయి. ఈ క్రమంలోనే నిన్న శ్రీమంతుడు సినిమా ప్రదర్శితమవుతోన్న థియేటర్లన్నీ హౌస్‌ఫుల్ బోర్డ్‌లతో కనిపించాయి.
ఏపీ, తెలంగాణ, ఓవర్సీస్, తమిళనాడు, కర్ణాటక.. ఇలా అన్ని ప్రాంతాలను కలుపుకొని చూస్తే మొదటిరోజు ‘శ్రీమంతుడు’ సినిమా ప్రప్రంచవ్యాప్తంగా సుమారు 30 కోట్ల షేర్ సాధించింది. ఊరిని దత్తత తీసుకోవడమనే అంశాన్ని సున్నితమైన ఫ్యామిలీ సెంటిమెంట్, కమర్షియల్ ఎలిమెంట్స్ కలిపి తీసిన ఈ సినిమాకు మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో మొదటిరోజు కలెక్షన్ల స్థాయిలోనే వీకెండ్ కలెక్షన్స్ కూడా ఉంటాయని ట్రేడ్ టాక్! మైత్రీ మూవీస్ పతాకంపై తెరకెక్కిన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది.

