
సూపర్ స్టార్ మహేష్ అభిమానులు ఎప్పుడెప్పుడు తమ హీరోను స్క్రీన్‌పై చూస్తామా అని ఎంతో ఆసక్తిగా చూస్తున్న ఎదురుచూపులకు మరో మూడురోజుల్లో తెరపడనుంది. తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున ఆగష్టు 7న మహేష్ హీరోగా నటించిన ‘శ్రీమంతుడు’ విడుదల కానున్న విషయం తెలిసిందే! కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో ‘సెల్వందన్’ పేరుతో విడుదల కానుంది. ఇప్పటికే తమిళ వర్షన్ డబ్బింగ్‌కి సంబంధించిన అన్ని కార్యక్రమాలూ పూర్తయినట్లు తెలుస్తోంది.
ఇక గత పది రోజులుగా తెలుగులో క్రేజీ ప్రమోషన్లతో దూసుకుపోతున్న ‘శ్రీమంతుడు’, తమిళంలో నేటినుంచి ప్రచార కార్యక్రమాలకు తెరలేపనున్నాడు. మహేష్ స్వయంగా ఈ సాయంత్రం చెన్నైలో జరిగే ప్రచార కార్యక్రమంలో భాగం కానున్నారు. ఈ సందర్భంగా ’సెల్వందన్’ ఆడియోను విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హీరోయిన్ శృతి హాసన్, దర్శకుడు కొరటాల శివ తదితరులు హాజరు కానున్నారు. ఇక తెలుగులో శ్రీమంతుడుకు సంబంధించిన కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. సెన్సార్ బృందం ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. రిలీజ్‌కి ముందే మంచి పాజిటివ్ వైబ్రేషన్‌తో ఉన్న ఈ సినిమా కచ్చితంగా మంచి హిట్ కొడుతుందన్న నమ్మకంతో అభిమానులు ఉన్నారు.

