
ఒక క్రేజీ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతోందనగానే ఆ సినిమాపై అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకే రేంజ్ లో ఉంటాయి. ఆ అంచనాలను అందుకోవడం కాస్త కష్టమైన పని, కానీ ‘శ్రీమంతుడు’ సినిమాతో సూపర్ స్టార్ మహేష్ బాబు – కొరటాల శివ మాత్రం చాలా ఈజీగా ఆ అంచనాలను అందుకొని, అభిమానులను ఓ రేంజ్ లో సంతృప్తిపరిచారు. అంతే కాకుండా బాక్స్ ఆఫీసు వద్ద కూడా శ్రీమంతుడు తన సత్తా చాటుకుంటూ ఫస్ట్ వీకెండ్ మరియు ఫస్ట్ వీక్ లో రికార్డ్ స్థాయి కలెక్షన్స్ ని సాధిస్తోంది. ఫస్ట్ వీకెండ్ లోనే శ్రీమంతుడు ప్రప్రంచవ్యాప్తంగా కలుపుకొని 40 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసింది.
అంతే కాకుండా ఓవర్సీస్ లో 3 రోజుల్లో 2 మిలియన్ మార్క్ ని క్రాస్ చేసి ఓవర్సీస్ టాలీవుడ్ టాప్ గ్రాసర్స్ లో సెకండ్ సినిమాగా నిలిచిందని ఇది వరకే తెలియజేశాం. తాజాగా నైజాం నుంచి అందిన ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం మొదటి నాలుగు రోజుల్లో 12 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసింది. ఇప్పటి వరకూ నైజాంలో నాలుగు రోజుల్లో 16.24 కోట్ల షేర్ మార్క్ కలెక్ట్ చేసిన సినిమా బాహుబలి. ఇప్పుడు బాహుబలి తర్వాత శ్రీమంతుడు 12 కోట్లు కలెక్ట్ చేసి నైజాంలో మొదటి 4 రోజుల్లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాల లిస్టులో శ్రీమంతుడు సెకండ్ ప్లేస్ కొట్టేసింది. బాహుబలి తర్వాత ఆ రేంజ్ కలెక్షన్స్ సాధిస్తూ శ్రీమంతుడు రికార్డ్స్ సృష్టిస్తోంది.
ఒక సోషల్ మెసేజ్ ఉన్న కంటెంట్ లో ఫ్యామిలీ, యాక్షన్, లవ్ ఇలా అన్ని అంశాలను మిక్స్ చేసి శ్రీమంతుడు సినిమా తీసిన కొరటాల శివని అందరూ మెచ్చుకుంటున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలు పోషించారు.