ఇంటర్వ్యూ : సునీల్ – మళ్లీ కమెడియన్ గా నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాను !
Published on Sep 3, 2018 5:36 pm IST

భీమినేని శ్రీనివాస్ దర్శకత్వంలో సునీల్ మరియు నరేష్ కలిసి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సిల్లీ ఫెలోస్’. కామెడీ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 7 న విడుదల కాబోతుంది. ఈ సంధర్బంగా సునీల్ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీ కోసం..

మీరు దాదాపు పది సంవత్సరాల గ్యాప్ తరువాత, మళ్లీ కమెడియన్ గా నటించారు. ఇప్పుడు మీకు ఏమనిపిస్తోంది ?

వాస్తవానికి నేను మొదటిసారి హీరోగా నటించిన ‘అందాల రాముడు’ సినిమా మంచి విజయం సాధించిన తర్వాతే, నాకు హీరోగా చాలా సినిమాల్లో ఆఫర్స్ వచ్చాయి. కానీ నేను ఏ సినిమా ఒప్పుకోలేదు. ఆ తర్వాత రాజమౌళిగారు నాతో ‘మర్యాద రామన్న’ చేయడంతో ఇక హీరోగా సినిమాలు చెయ్యొచ్చు అని నమ్మకం వచ్చింది. దాంతో హీరోగా సినిమాలు అంగీకరించాను. ఆ క్రమంలో అప్రమేయంగా మేకర్స్ కామెడీ రోల్స్ కు నన్ను అప్రోచ్ అవ్వడం మానేశారు, దాంతో కమెడియన్ గా చాలా గ్యాప్ వచ్చింది. ఈ మధ్యలో హీరోగా సినిమాలు రావడంతో అలా ఇప్పటివరకు హీరోగానే సినిమాలు చెయ్యడం జరిగింది. నాకైతే కమెడియన్ గా చెయ్యటమే హ్యాపీ.

‘సిల్లీ ఫెలోస్’ విషయానికి వద్దాం. ఈ సినిమా గురించి క్లుప్తంగా చెప్పండి ?

సిల్లీ ఫెలోస్ ఒక అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్. సినిమా మొత్తం చాలా సరదాగా వినోదాత్మకంగా గడిచిపోతుంది. కాకపోతే లాజిక్ లు లాంటివి పట్టించుకోకుండా సినిమాని చూస్తే, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎన్ని చెప్పినా ప్రేక్షకులకు మాత్రం చక్కని వినోదాన్ని అందించబోతున్నామని మాత్రం చెప్పగలను. మెయిన్ గా ఈ సినిమా ఎక్కడా నిరాశపరచదని నేను గట్టిగా నమ్ముతున్నాను.

ఈ సినిమాలో మీ పాత్ర గురించి చెప్పండి ?

నరేష్ పాత్రకు, నా పాత్ర ఒక పాడింగ్ లా ఉంటుంది. నిజం మాట్లాడుకుంటే ఈ సినిమాకి నరేషే హీరో. కానీ సినిమాలో తన ప్రతి సిట్యుయేషన్ నా పాత్రతో ముడిపడి ఉంటుంది. అంటే నరేష్ చేసే కొన్ని పనుల కారణంగా నేను ఓ సమస్యలో చిక్కుకుంటాను. అందులోంచి బయటపడడానికి నేను పడే పాట్లు చాలా ఆసక్తికరంగా ఉండటంతో పాటుగా బాగా నవ్విస్తాయి.

అల్లరి నరేష్ తో కలిసి పని చేశారు. ఆ ఎక్స్ పీరియన్స్ గురించి చెప్పండి ?

మేం గతంలోనే చాలా సినిమాల్లో కలిసి నటించాం. కానీ ‘తొట్టి గ్యాంగ్’ సినిమా తర్వాత, నేను నరేష్ తో కలిసి, మళ్లీ ఈ సినిమాలోనే పూర్తి స్థాయి పాత్రను చేశాను. ఇక వర్క్ విషయం అంటే.. టైమింగ్ లో మా ఇద్దరి మధ్య మంచి అవగాహన ఉంది. ఎంజాయ్ చేస్తూ పని చేస్తాం.

మీరు మళ్లీ కమెడియన్ గా నటిస్తున్నాను అని చెప్పినప్పుడు, మీ శ్రేయోభిలాషలు ఎలా రియాక్ట్ అయ్యారు ?

వారు ఎప్పటినుంచో నన్ను మళ్లీ మంచి కామెడీ పాత్రల్లో చూడాలని కోరుకుంటున్నారు. నేను కమెడియన్ గా నటిస్తున్నానని తెలియగానే చాలా సంతోషించారు. ఇటీవలే నేను అమెరికాకు వెళ్తే, అక్కడ కూడా చాలామంది.. నన్ను కామెడీ రోల్స్ చెయ్యాలని కోరుతున్నారు. అయినా వ్యక్తిగతంగా నేను కామెడీ రోల్స్ చేస్తేనే నాకు చాలా స్వేచ్ఛ ఉంటుంది. హీరోగా సాధ్యం కానటువంటి వివిధ పాత్రలను కమెడియన్ గా నేను నటించొచ్చు. ఏది ఏమైనా నేను మళ్లీ కమెడియన్ గా తిరిగి నటిస్తున్నందుకు సంతోషంగా ఉన్నాను.

‘అరవింద సమేత’లో మీరు నటిస్తున్నారు. కారణం త్రివిక్రమ్ మీకు మంచి ఫ్రెండ్ అవ్వటమేగా ?

అవును. త్రివిక్రమ్ కి నేను కామిక్ పాత్రలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నానని తెలుసు. అందుకే నా కోసం తను ‘అరవింద సమేత’లో ఓ మంచి పాత్రను వ్రాసాడు. దానికి కంటే ముందు నాకు ఎన్టీఆర్ తో కలిసి పని చేయడం మరిచిపోలేని ఓ చిరస్మరణీయ అనుభవం. ఇంతకు ముందు నేను తారక్ తో చాలా తక్కువ సినిమాల్లో నటించినప్పటికీ, వ్యక్తిగతంగా మేము చాలా క్లోజ్ గా ఉంటాము. తన ఆత్మవిశ్వాసం మరియు స్వచ్ఛమైన తన వ్యక్తిత్వం చాలా గొప్పది. ఈ పాత్రను నన్ను చేయమని ప్రోత్సహించిన ఎన్.టి.ఆర్ కి, త్రివిక్రమ్ కి నేను కృతజ్ఞతలు చెప్పాలి.

మీరు ఖైదీ నెం.150లో ఛాన్స్ ని మిస్ అయ్యారు. ప్రస్తుతం చిరంజీవి నటిస్తోన్న సైరా చిత్రంలో మిమ్మల్ని చూడవచ్చా ?

లేదండి. సైరా నుండి నాకు ఎలాంటి పాత్ర రాలేదు. కానీ చిరంజీవిగారి తరువాత సినిమాలో మాత్రం ఖచ్చితంగా నటిస్తాను.

మీరు ప్రస్తుతం ఏ ఏ సినిమాల్లో నటిస్తున్నారు ?

శ్రీను వైట్ల, రవితేజ ‘అఆఆ’ లో చేస్తున్నాను, ఆ సినిమాలో నాకు రవితేజ మధ్య వచ్చే కొన్ని కామెడీ సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి. అలాగే శర్వానంద్ ‘పడి పడి లేచే మనసు’లో కూడా ఓ మంచి ఆహ్లాదకరమైన పాత్రలో కనిపించబోతున్నాను.

  • 43
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook