ఇంటర్వ్యూ : సునీల్ రెడ్డి – గల్ఫ్ బాధితుల కష్టాల్ని చెప్పాలనే ఈ సినిమా తీశాను !

ఇంటర్వ్యూ : సునీల్ రెడ్డి – గల్ఫ్ బాధితుల కష్టాల్ని చెప్పాలనే ఈ సినిమా తీశాను !

Published on Oct 10, 2017 2:30 PM IST

ఎప్పటికప్పుడు సామాజిక అంశాలే ప్రధానంగా చేసుకుని సినిమాలు చేసే దర్శకుడు సునీల్ రెడ్డి ఈసారి గల్ఫ్ వలస బాధితుల కష్టాల్ని ఆధారంగా చేసుకుని ‘గల్ఫ్’ పేరుతో ఒక సినిమా చేశారు. ఈ నెల 13న సినిమా రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం..

ప్ర) ఈ సినిమా చేయడం ఎలా అనిపిస్తోంది ?
జ) ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తైతే ఈ ‘గల్ఫ్’ చిత్రం మరొక ఎత్తు. ఇది నా గుండెకు బాగా దగ్గరైన చిత్రం. రెండున్నరేళ్లు కష్టపడి ఈ సినిమా తీశాం.

ప్ర) రెండున్నరేళ్ళు అంటే ఎక్కువ సమయమే పట్టునట్టుంది ?
జ) అవును. సబ్జెక్ట్ అలాంటిది. సినిమా కోసం చాల రీసెర్చ్ చేయాల్సి వచ్చింది. అందుకే ఎక్కువ టీమ్ పట్టింది.

ప్ర) అసలు ఈ అంశం మీద సినిమా చేయాలని ఎందుకనిపించింది ?
జ) అమెరికా వలసల మీద చాల సినిమాలోచ్చాయి. గల్ఫ్ వలసలు మీద పూర్తి స్థాయి సినిమాలు రాలేదు. తెలుగులో అయితే అస్సలు రాలేదు. అందుకే ఆ సున్నితమైన అంశం మీద సినిమా చేద్దామనుకుని చేశాను.

ప్ర) ఈ సినిమా చేయడం వెనుక మీ లక్ష్యం ?
జ) మన తెలుగు రాష్ట్రాల నుండే గల్ఫ్ కు ఎక్కువ మంది వలస వెళుతుంటారు. అక్కడ కష్టాలు పడే వారిలో కూడా 95 శాతం మంది తెలుగువాళ్ళే. వాళ్లలో హింసకు గురయ్యే ఆడవాళ్ళు కూడా ఉన్నారు. వారి పట్ల ప్రభుత్వాలు కాస్త ఎక్కువగా స్పందించాలి. కానీ అలా జరగడంలేదు. ప్రభుత్వంలో, నాయకుల్లో ఆ స్పందన తీసుకురావడం కోసమే ఈ సినిమా చేశాను.

ప్ర) మీ రీసెర్చ్ లో మీరు తెలుసుకున్న నిజాలేమిటి ?
జ) గల్ఫ్ దేశాల్లో ఎక్కువగా పనిచేస్తుంది తెలుగువాళ్లే. అక్కడి స్థానికులు చేసే మోసం కన్నా మన వాళ్ళని మన వాళ్లే మోసం చేయడం ఎక్కువ. ఎంతో మంది కొన్నేళ్ళ పాటు కుటుంబాల్ని వదిలి అక్కడే కష్టపడుతున్నారు. ఏటా మన తెలుగు రాష్ట్రాలకు వాళ్ళ ద్వారా 30,000 కోట్ల రూపాయలు వస్తోంది. అలాంటి వారిని గురించి ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోవడం లేదు.

ప్ర) ఈ సినిమా కమర్షియల్ గా ఎలా వర్కవుట్ అవుతుంది ?
జ) మన తెలుగువారిలో 50 లక్షల మందికి గల్ఫ్ అంటే ఏమిటో, అక్కడి కష్టాలు ఎలా ఉంటాయో తెలుసు. ఇది వారి సినిమానే. వారు చూసినా చాలు సినిమా కమర్షియల్ గా సక్సెస్ అవుతుంది. వాళ్ళు చూస్తారని నమ్మకంతోనే సినిమా చేశాను.

ప్ర) ఇతర ప్రేక్షకులకు కావాల్సిన కమర్షియల్ అంశాలు ఇందులో ఏమున్నాయ్ ?
జ) ఇందులో ప్రేమ కథ ఉంది. దాన్ని మించిన కమర్షియల్ పాయింట్ వేరొకటి ఉంటుందని నేననుకోను. గల్ఫ్ కష్టాల నైపథ్యంలోనే మన తెలుగబ్బాయి, తెలుగమ్మాయికి మధ్య నడిచే ప్రేమ కథ అది. కమర్షియల్ అంశాలు కోరుకునేవారు టికెట్టు పై పెట్టిన డబ్బుకి న్యాయం జరుగుతుంది

ప్ర) రిలీజ్ ఏ స్థాయిలో ఉండబోతోంది ?
జ) ఇండస్ట్రీలో, డిస్ట్రిబ్యూషన్ సర్కిల్స్ లో నాకున్న పరిచయాలతో రిలీజ్ కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకున్నాను. సినిమా సుమారు 250 నుండి 300 స్క్రీన్లలో రిలీజ్ కానుంది.

ప్ర) మీ తదుపరి ప్రాజెక్ట్స్ ఏంటి?
జ) ఇదివరకు నేను చేసిన ‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, ఒక క్రిమినల్ క్రైమ్ కథ’ సినిమాలకు మూడవ భాగంగా రొమాంటిక్ క్రిమినల్స్ అనే సినిమా చేస్తున్నాను. అది కూడా త్వరలోనే ఉండనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు