
తమిళ సూపర్ స్టార్ సూర్య, విలక్షణ దర్శకుడు విక్రమ్ కుమార్ కాంబినేషన్లో ’24’ పేరుతో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ’13 బీ’, ‘ఇష్క్’, ‘మనం’.. ఇలా సరికొత్త కథాంశాలతో రూపొందిన సినిమాలతో ట్రెండ్ సృష్టించిన విక్రమ్ కుమార్, 24 సినిమాను ఓ సైన్స్ ఫిక్షన్ కథతో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. సూర్య తన సొంత 2D ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గత కొద్ది నెలల క్రితం ముంబైలో మొదలైన ఈ సినిమా షెడ్యూల్ ప్రస్తుతం చివరిదశకు చేరుకుంది. మరో వారం రోజుల్లో ఈ షెడ్యూల్ పూర్తి కానున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ షెడ్యూల్ తర్వాత 24 టీమ్ పోలాండ్‌కు షిఫ్ట్ కానుంది. పోలాండ్ సుమారు 20 రోజుల పాటు జరగనున్న ఈ షెడ్యూల్‌లో రెండు పాటలతో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. సూర్య సరసన సమంత ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుండగా ఏ.ఆర్.రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ కథ కావడంతో ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ సన్నివేశాలు చాలా ఉంటాయని, ఈ సన్నివేశాలన్నింటినీ క్వాలిటీగా రూపొందించాలన్న ఆలోచనలో విక్రమ్ కుమార్ సినిమాను పొంగల్ రేస్ నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. 2016సమ్మర్ కానుకగా పెద్ద ఎత్తున ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. తెలుగులో హీరో నితిన్ ఈ సినిమాను విడుదల చేయనున్న విషయం తెలిసిందే.

