సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేసే వారికి, బయట అనవసరమైన విమర్శలు, వాదనలు చేసేవారికి ఘాటైన సమాధానం ఇవ్వడంలో నటి తాప్సీ ఎప్పుడూ ముందుంటారు. ప్రజెంట్ జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకల్లో తాప్సీ పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా ఆమె ప్రేక్షకులతో కాసేపు ముఖాముఖీ మాట్లాడారు.
ఈ సమయంలో ఆమె పూర్తిగా ఇంగ్లీష్ భాషలోనే మాట్లాడారు. అది నచ్చని ప్రేక్షకుడు ఇకరు ఇంగ్లీష్ భాషలో కాకుండా హిందీలో మాట్లాడాలని కోరారు. కానీ తాప్సీ మాత్రం ఇక్కడున్న అందరికీ హిందీ రాకపోవచ్చు అంటూ సమాధానం ఇచ్చారు. అయినా ఊరుకోని సదరు ప్రేక్షకుడు మీరు హిందీ నటి కాబట్టి హిందీలోనే మాట్లాడాలని పట్టుబట్టాడు.
దీంతో తాప్సీ నేను దక్షిణాది నటిని కూడా. తమిళం, తెలుగులో మాట్లాడితే మీకు సమ్మతమేనా అంటూ ఎదురు ప్రశ్న వేశారు. దీంతో వితండవాదం చేసిన ప్రేక్షకుడు సైలెంట్ అయిపోయాడు. ఆమె ప్రశ్నను ఇతర ప్రేక్షకులు సైతం పెద్ద ఎత్తున సపోర్ట్ చేశారు.


