
‘బాహుబలి’ సినిమాతో దేశవ్యాప్తంగా స్టార్ స్టేటస్‌ను కొట్టేసిన రానా, త్వరలో ‘ఘాజీ’ పేరుతో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. పీవీపీ సినిమా ప్రతిష్టాత్మకంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి నిర్మించనున్న ఈ సినిమాకు సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. ఇక ఈ సినిమాలో తాప్సీ హీరోయిన్‌గా నటించనున్న విషయాన్ని కూడా ఇంతకుముందే తెలియజేశాం. తాజాగా ఘాజీ సినిమాలో తన పాత్ర గురించి తాప్సీ పలు ఆసక్తికరంగా విషయాలను పంచుకున్నారు.
నావికా దళ యుద్ధం నేపథ్యంలో మొట్టమొదటి సినిమాగా తెరకెక్కనుందన్న ప్రచారం పొందుతోన్న ఈ సినిమాలో తాప్సీ ఓ టఫ్ పాత్రను పోషిస్తున్నారట. ఆ పాత్ర కోసం ఇప్పట్నుంచే కొంత ట్రైనింగ్ తీసుకోవడంతో పాటు పాత్ర నేపథ్యం గురించి కొంత స్టడీ కూడా చేస్తున్నారట. డిసెంబర్ నెలాఖర్లో తాప్సీ ఈ సినిమా సెట్స్‌లో జాయిన్ కానున్నట్లు సమాచారం. ఇలాంటి ఒక ప్రత్యేకమైన సినిమాలో నటించడం చాలా సంతోషంగా ఉందని, చాలాకాలం తర్వాత హైద్రాబాద్‌లో షూటింగ్ చేయడం కూడా బాగుందని తాప్సీ ఈ సందర్భంగా తెలిపారు. రావు రమేష్ ఈ సినిమాలో ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

