
నాగార్జున – కార్తీలు హీరోలుగా ఓ భారీ మల్టీ స్టారర్ రూపొందుతోన్న విషయం తెలిసిందే. పీవీపీ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాలో నటించేందుకు హీరోయిన్ శృతిహాసన్ ఒప్పుకొని, చివరి నిమిషంలో తప్పుకోవడం అప్పట్లో వివాదానికి తెర తీసింది. ఈ విషయం కోర్టు దాకా వెళ్ళింది. అయితే ఈ స్థాయి సమస్యలు తలెత్తినా సినిమా షూటింగ్‌ను మాత్రం ఎక్కడా ఆపకుండా తీసుకెళ్ళడంలో నిర్మాణ సంస్థ విజయం సాధించింది. శృతి హాసన్ స్థానంలో ప్రస్తుతం తమన్నాను తీసుకున్నారు.
ఇక మార్చి 15న ప్రారంభమైన ఈ సినిమా, వివాదాలతో సంబంధం లేకుండా షూటింగ్ పూర్తి చేసుకుంటోంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి కాగా, రెండో షెడ్యూల్ ఈమధ్యే ప్రారంభమైంది. ఈ షెడ్యూల్లో నేటినుంచి తమన్నా షూటింగ్లో పాల్గొననున్నారు. ఇదే విషయాన్ని ఆమె తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. తెలుగు, తమిళ భాషల్లో నిర్మితమౌతోన్న ఈ భారీ బడ్జెట్ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకుడు.

