రామ్ చరణ్, బోయపాటిల సినిమాలో తమిళ హీరో !

19th, January 2018 - 03:14:07 PM


రామ్ చరణ్, బోయపాటి శ్రీనుల చిత్రం ఈరోజు ఉదయమే పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఈరోజే మొదలైన షెడ్యూల్ జనవరి నెలాఖరు వరకు జరగనుండగా రెండవ షెడ్యూల్ ను ఫిబ్రవరిలో ప్లాన్ చేయనున్నారు. ఆరంభంలోనే భారీ అంచనాల్ని మూటగట్టుకున్న ఈ చిత్రంలో నటీనటులు కూడా అందరూ పెద్ద స్థాయి వారే కావడం విశేషం.

ఇప్పటికే బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రతినాయకుడిగాను, స్నేహ కీలక పాత్రల్లోనూ నటిస్తుండగా తమిళ హీరో ప్రశాంత్ కూడా ఇందులో ఒక ముఖ్య పాత్ర పషించనున్నారు. ప్రశాంత్ గతంలో ‘జీన్స్, దొంగ దొంగ’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైనవారే. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు రిషీ పంజాబీ సినిమాటోగ్రఫీ, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి కైరా అద్వానీ చరణ్ కు జోడీగా నటించనుంది.