సమంత మీద తమిళ జనం ఆగ్రహం.. కారణం ఇదేనట

Published on May 21, 2021 1:32 am IST

అమెజాన్ ప్రైమ్ నుండి జూన్ 4వ తేదీన రిలీజ్ కానుంది ‘ది ఫ్యామిలీ మ్యాన్ -2’ వెబ్ సిరీస్. రాజ్ అండ్ డీకే ఈ వెబ్ సిరీస్ దర్శకులు. ఇటీవలే ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ అందరినీ ఆకట్టుకోగా కొందరు తమిళులకు మాత్రం విపరీతమైన ఆగ్రహం తెప్పిస్తోంది. అది కూడ సమంత అక్కినేని చేస్తున్న పాత్ర మీదే. సమంత ఈ సీజన్ 2లో రాజి అనే ఉగ్రవాది పాత్రలో కనిపించనున్నారు. ఇదే కొందరు తమిళులకు నచ్చట్లేదు. ఎల్టీటీఈ విషయంలో తమిళులు చాలా సున్నితంగా ఉంటారు. ఈ అంశాలను టచ్ చేసి ఇప్పటికే చాలామంది ఒక వర్గం తమిళుల ఆగ్రహానికి లోనయ్యారు.

ఇప్పుడు ‘ది ఫ్యామిలీ మ్యాన్ -2’ విషయంలో కూడ సమంత పాత్ర మీద ఇదే ఆగ్రహం వ్యక్తమవుతోంది. సమంత చేస్తున్న పాత్రలో ఎల్టీటీఈ ఛాయలు కనిపిస్తున్నాయని, అలాంటి ఛాయాలున్న పాత్రను ఉగ్రవాదిగా చూపడం ఏమాత్రం బాగోలేదని, అసలు తమిళనాడుకు చెందిన సమంత తమిళుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న వెబ్ సిరీస్ చేయడం ఏమిటని మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో ఫ్యామిలీ మ్యాన్ ఎగైనెస్ట్ తమిళ్స్ అంటూ ట్రెండ్ చేస్తున్నారు. మరి ఈ వివాదం నుండి వెబ్ సిరీస్ ఎలా బయటపడుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :